వర్మ 'రక్త చరిత్ర' - ప్రత్యేకం
-నా సినిమా కోసం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెతికాను. ఎలాంటి మనుషులు ఒకర్నొకరు వేట కొడవళ్లు, గొడ్డళ్లతో చంపుకుంటారు..? తమ లక్ష్యం కోసం అమాయక ప్రజలని కూడా చంపడానికి ఎందుకు వెనుకాడరు? హత్యలకి వెనకాడని వాళ్ల మనస్తత్వం ఏమిటి? వాళ్ల పగ తీర్చుకోవడం కోసం తమ ప్రాణాలివ్వడానికి కూడా ఎందుకు సిద్ధపడుతున్నారు? వాళ్లకి ఇంత ధైర్యం, ఇంత పిచ్చితనం ఎక్కణ్ణించి వస్తుంది? ఎందుకు వస్తుంది? అని తెలుసుకోవాలనుకున్నాను.
-ఈ ప్రయత్నంలో ఆ జరిగిన సంఘటనలకు, ఆ సంఘటనలు సృష్టించిన మనుషులకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న దాదాపు అందర్నీ కలిశాను.
-పరిటాల రవి కుటుంబాన్ని మరియు అతనితో పనిచేసిన అతని మనుషులు, రవి అడవిలో ఉన్నప్పుడు అతను సహవాసం చేసిన నక్సలైట్లని కూడా కలిశాను. సూరి, అతని మనుషులను అనంతపురం సెంట్రల్ జైలులో కలిశాను. అలాగే సూరికి తెలిసిన, సహాయం చేసిన చాలామంది వ్యక్తులను కూడా కలిశాను. రవి, సూరికి సంబంధించిన కేసులను పరిశోధించిన అనేక మంది పోలీస్ ఆఫీసర్లను కూడా కలిశాను. రవి బద్దశత్రువు అయిన ఓబుల్ రెడ్డిని నరికి చంపిన వాళ్లలో ఒక వ్యక్తిని కూడా నా పరిశోధనలో కలిశాను. పైన చెప్పిన వాళ్లందర్నీ కలిసిన తర్వాత సేకరించిన సమాచారం, నా సినిమాకు మాత్రమే కాకుండా నా నిజ జీవితంలో కూడా ఒక విస్తృతమైన పరిధిలో మనుషుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక మహదవకాసంగా మారింది.
-రక్తచరిత్ర అనేది నిజమైన కథా..? అని అందరూ అడుగుతున్నారు నన్ను. అవును. రక్తచరిత్ర నా దృక్పధంలో నిజమైన కథ. ఇలా ఎందుకంటున్నానంటే, చాలా రహస్యంగా జరిగిన సంఘటనల గురించి, దానికి సంబంధించిన మనుషులని చాలా కాలం తర్వాత విచారిస్తే, వాళ్ల దృక్పధాలు, నాకు చెప్పడంలో వాళ్ల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కానీ, నేను ఈ కథలో ఎవరికీ సంబంధం లేని వ్యక్తిని కాబట్టి జరిగిన విషయాల వెనుక దాగి ఉన్న అసలు కారణాన్ని అర్ధం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాను. వాస్తవం కోసం వెతుకులాడుతూ ఒక జర్నలిస్ట్ గా...ఒక డిటెక్టివ్ గా...ఓ మానసిక పరిశీలకుడుగా మారాను.
-రక్తచరిత్ర నా సినిమా జీవితాన్ని కొత్తగా నిర్వచించనున్న సినిమా మాత్రమే కాదు. నా జీవితాన్నే కొత్తగా మార్చబోతున్న సినిమా. ఈ సినిమా కోసం నేను చేసిన పరిశీలన నా ఆలోచనలు మొత్తం మార్చేసింది. ఎందుకంట ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు తెలియని చాలా విషయాల పట్ల ఒక కచ్చితమైన అవగాహన ఏర్పడింది. ఎవరి జీవితాలైతే అనుకోని సంఘటనలు, అనుకోని పరిస్థితులు, అనుకోని వ్యక్తుల వలన ఒక తుఫాను లాంటి వలయంలో చిక్కుకున్నాయో అలాంటి మనుషులను కలిసి, వాళ్ల అనుభవాలను వినడం మూలంగా నా జీవితం పట్ల నా దృక్పథం కూడా పూర్తిగా మారిపోయింది.
-ఇప్పటి వరకూ నేను చూసిన సినిమాలలో, చదివిన పుస్కకాలలో, నేను కలిసిన మనుషులలో లేని ఒక అత్యంత కొత్తదనం రక్తచరిత్రలో ఉంటుంది. ఎందుకంటే, కథా వస్తువు అటువంటింది. కచ్చితంగా ఈ రక్తచరిత్ర, నా సినిమా చరిత్రను తిరగ రాస్తుందని నేను నమ్ముతున్నాను. నేను గానీ, నా సినిమాలు గానీ రక్తచరిత్ర తర్వాత ఇంతకు ముందులా ఉండవు.
-తెలుగు సినిమాని రామ్ గోపాల్ వర్మకి ముందు, రామ్ గోపాల్ వర్మకి తర్వాత అని చెప్పుకోవాలని కొందరంటారు. నేననుకునేది రామ్ గోపాల్ వర్మ అనేవాడు రక్తచరిత్రకి ముందు, రక్తచరిత్ర తర్వాత అని చెప్పుకుంటారని.

Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|