పవన్ తో 'లవ్ ఆజ్ కల్'
హీరో పవన్ కల్యాణ్ 'పులి' చిత్రం 3 పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తి కావడంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నట్టు తెలిసింది. నటుడు, నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. గణేష్ బాబు ఇటీవల రవితేజ హీరోగా 'ఆంజనేయులు' చిత్రాన్ని నిర్మించారు. సంస్థ రెండో చిత్రాన్ని ఆయన పవన్ తో చేయబోతున్నారు. దీనికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు.
'నువ్వేకావాలి', 'మల్లీశ్వరి' పలు హిట్ చిత్రాలను అందించిన విజయభాస్కర్ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ ను ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పవన్ తో చేయబోయే చిత్రానికి ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం తీసుకోబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి తెలుగు రీమేక్ గా ఉండబోతోందని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్, దీపిక పడుకునే జంటగా నటించిన ఈ చిత్రం 2009లో విడుదలైన '3 ఇడియట్స్', 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' తర్వాత మూడో పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. 'పులి' షూటింగ్ పూర్తయిన వెంటనే పవన్ కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు గణేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|