'అవారా'గా కార్తి
తమిళ హీరో సూర్య ('గజనీ' ఫేమ్) సోదరుడు కార్తి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనుకుంటున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'యుగానికి ఒక్కడు' తెలుగులోకి అనువాదమై కమర్షియల్ గా ఫరవాలేదనిపించుకుంది. తమిళంలో ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'పయ్యా' చిత్రం 'అవారా' పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. కార్తి, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి లింగుస్వామి ('రన్' ఫేమ్) దర్శకుడు. 'యుగానికి ఒక్కడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా తెలుగులోకి అందిస్తోంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను యూనిట్ తెలియజేసింది. కార్తి, తమన్నా, లింగుస్వామి, స్టూడియో గ్రీన్ జ్ఞానవేలు తదితరులు పాల్గొన్నారు.
కార్తి తెలుగులో మాట్లాడుతూ, 'యుగానికి ఒక్కడు' చిత్రాన్ని తెలుగులో బాగా ఆదరించారనీ, ఇప్పుడు 'అవారా' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ అనీ, లింగుస్వామి చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ చెప్పారు. లింగుస్వామి తీసిన 'రన్' చిత్రంతో స్టార్ డమ్ అందుకున్న మాధవన్ తరహాలో తనకు కూడా ఈ చిత్రం అలాంటి ఇమేజ్ తెస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. లింగుస్వామి మాట్లాడుతూ, తమిళంలో ఇప్పటికే షూటింగ్ పూర్తయిందనీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నామనీ చెప్పారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర , కార్తితో తన కెమెస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్టు తమన్నా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 'యుగానికి ఒక్కడు' పెద్ద హిట్టయిందనీ, అదే తరహాలో ఈ చిత్రం కూడా తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందనీ జ్ఞానవేలు అన్నారు.
Be first to comment on this News / Article!
|