|
|
Articles: My Thoughts | జనమాధ్యమాల్లో తెలుగు - Site Administrator
| |
(ఎన్.వేణుగోపాల్)
వర్తమాన సమాజంలో జనమాధ్యమాల పాత్ర గురించి వేరుగా చెప్పనక్కర్లేదు. గతంలో సమాచారమైనా, వినోదమైనా కేవలం కొందరికే అందుబాటులో ఉండేవి. నేడు అలా కాకుండా జనం చెంతకు చేరుతున్నాయి. ఇది పత్రికలు, రేడియో, టీవీ, సినిమా వంటి జనమాధ్యమాల ద్వారా సాధ్యమైంది. ప్రస్తుతం వీటి పాత్ర కేవలం సమాచారం పంచడం, వినోదం అందించడానికే పరిమితం కాలేదు. మనం సమాచారం కోసం ఆధారపడినా, వినోదం కోసం ఆశ్రయించినా ఫలితం మాత్రం మరింత లోతుగా ఉంటోంది. మన ఆలోచనలు, పరివర్తన కూడా విశేషంగా జనమాధ్యమాల ప్రభావానికి లోనయ్యాయి.
ఇటీవలి కాలంలో సంభవించిన పరిణామాల కారణంగా ఈ చర్చ మరింత అవసరమైంది. గత దశాబ్దంలోనే ఉపగ్రహ ఛానళ్ళ కారణంగా చాలా విషయాలు చర్చకు నిలుస్తున్నాయి. పత్రికలైతే అక్షరాశ్యుల మధ్యనే ఉంటాయి. సినిమాలైతే థియేటర్లకే పరిమితమౌతాయి. కానీ చిన్ని తెర ఈ రెండు పరిమితులను అధిగమించి నట్టింట నర్తిస్తోంది. ఒక్క తెలుగులోనే పన్నెండు ఉపగ్రహ ఛానళ్ళు... 24 గంటలూ 'వార్తలు' అందిస్తుండగా, 20కి మించిన చానళ్ళు 'వినోదం' పంచుతున్నాయి. అలాగే, ఎఫ్ ఎం రేడియో కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల్లో 24 గంటలూ వినోదం పేరిట కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి.
ఈ ఛానళ్ళు, ఎఫ్ ఎం కేంద్రాలు, సినిమాలు, పత్రికలు... ఎటువంటి విషయాలను ఇస్తున్నాయి అనేది తప్పకుండా చర్చనీయాంశమే. అదే సమయంలో ఈ విషయాలన్నీ ఎటువంటి భాషలో ఇస్తున్నాయన్నది కూడా కీలకంగా మారుతోంది. ప్రైవేటు ఛానళ్ళ సీరియళ్ళు గురించి పరిశీలిస్తే ఇది వరకు లేని రీతిలో కొన్ని అంశాలనే బాగా సాగదీయడంతో ఇంతవరకూ తెలుగులో లేని విధంగా భాష వ్యక్తీకరింపబడుతోంది. ఉదాహరణకు అత్తాకోడళ్ళ సంవాదాలు, భార్యాభర్తల మధ్య కక్షసాధింపులు, ఉద్యోగి - యజమాని మధ్య ప్రతీకారాలు - అంతకు మించి అక్రమ సంబంధాల గురించి పాత్రల మధ్య సుదీర్ఘమైన సంభాషణలు వంటివి ఇంతకు ముందు తెలుగు నాటకాలు, నవలలు, పత్రికలు, సినిమాలలో లేని విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. టీవీ ఛానళ్ళ విషయానికొస్తే... ఇది వరకు లేని రీతిలో ప్రాంతీయ నుడికారాలు, సరిహద్దు భాష మిళితమవడాలు, అంతకు మించి తెలుగంటూ వాక్యాలకు వాక్యాలు ఇంగ్లీషు కలిపేయడాలు మనకు తెలిసిందే. పత్రికల్లో అయితే... వికేంద్రీకరణ కారణంగా తెలుగు వ్యక్తీకరణ మరింత అధ్వాన్నమైందనే విమర్శతో పాటు సహజంగానే పత్రికా రచన స్థాయి తగ్గిందనే వాదన కూడా ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|