|
|
Articles: Poetry | రూపు - Site Administrator
| |
(తాటి శ్రీకృష్ణ)
నిత్యం కొలిమిలో బొగ్గునవుతున్నా
అయినా మండలేకపోతున్నా,
తల్లి గర్భాన ప్రసవవేదనా శిశువునవుతున్నా
అయినా కేర్ మని అరుస్తూ బయటపడలేకపోతున్నా
కొండ బండల్లో డైనమైట్ నవుతున్నా
అయినా పెటేల్ మని పేలలేకపోతున్నా
సంఘర్షణా సంద్రంలో సుడిగుండాన్ని
తీరం చేరని బతుకు బండని
పాదుచేసిన మొలక గింజని
నేలలోనే సతమతమవుతున్నానే గాని మొలకెత్తలేకపోతున్నా
సానబడుతున్న చాకుని
అయినా పదనుతో పరపర కోయలేకపోతున్నా,
జోరీగ చెవి దూరినట్లు నిత్యం
సామాజికాంశాలు వింటున్నా
అయినా సాంఘిక విప్లవ పరీక్షలో ఫెయిలవుతున్నా
ఆములోని కుండైనా, వామిలోని మేతైనా
ఎన్ని నరుకుళ్ళు, ఎన్నెన్ని చిత్రహింసలు
ఒక్క రూపు కోసం
రగిలి రగిలి ఒక్కసారిగా
జ్వలించే పెనుజ్వాలనవుతూ
ఎగిసెగిసి ఉధృతమయ్యే మహాఝంఝనవుతా
నిరంతర సంఘర్షణ, శోధన, పరిశీలన...
నేను ఉదయించక ఆగని సూర్యుడినవుతా
చీకట్లను చీలుస్తూ...
ఈ లోకానికో అరుణకాంతినవుతా.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|