|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
రైతు : పెద్దోడ్నీ లెగొట్టే - ఏరుబూయించాలాడితోటి
మంటి బుకడం పాములాగ - తలెత్తడు తోకెత్తడు
సిన్నోడ్నీ లెగ్గొట్టే - ముటీమడీ (నమూనా నారుమడి) కట్టాల
ఆడాపిల్లని సూడకు - పెద్దమ్మిని లేపీయే
కునికి కునికి కుడితివెట్టి - తోలుకొస్త దెద్దుల్ని
సినదాయని సూడకు అమ్మిని-సీపురుతో కొట్టి లేపు
వాకిలి కల్లాపి జల్లి - వరిపిండీ ముగ్గెడతది
మామిడి కొమ్మలు విరిచి - ముంజూరుకు దోపవే
కొడవలి కక్కుల అంచులాగ తెలతెల్లని మసక మసక వేకువు కంటబడుతోంది. ఆ ఊరికి ఎటుజూసినా తూరుపే. ఆ వేళప్పుడు కళింగ సముద్ర యానగాలి చంకళ్ళ దూరి కితకితలు (గిలిగింతలు) పెట్టోస్తోంది. చిక... చిక... ఒక శబ్దం, కిచ... కిచ... మరో శబ్దం, గువ్వుల గునుపు, పావురాల కువకువ... అల్లా మావిడి చెట్టుమీంచి కోకిల పిలుపులు, యిల్లీ సీమసింత చెట్టు బొట్టలపై నిలబడి నికనికమని కూస్తున్న పిట్టల శబ్దాలు, మరేదో ఒక పిట్ట చివచివ చివచివలు, కివక్క కివక్క కివక్క కూతలు, చుకురిక్కూ చుకురిక్కూ... చిర్రచిక్కు చిర్రచిక్కు ధ్వనులు, కాకుల కలకలల కఠోర గొంతులు, బేపులు (కుక్కలు) అరుపులతో ఊరంతా మేల్కొంది.
బ్రుంగ్ న ఒక పక్షి ఎగిరి పారిపోతుంది...టస్సాదియ్యా ఏం పక్షో!
ట్రింగ్ మని ఒక పిట్ట యిటు ఎగిరిపోతోంది.
అరే... వీటి సిగదరగ.. వచ్చె వచ్చె..వచ్చొచ్చె
అంటాయేటి! ఎవర్రమ్మన్నారు వీట్ని? కిస్సుకిస్సు... కిసుకిస్సుకిస్సు... ఏం భాషరా బాబూ... ఇట్టే అవగతమైపోతుంది! ఆ మర్రి చెట్టు తొర్రల్లోంచి పక్షులు, పాము రాకను కనిపెట్టి గలాటా పడుతున్నాయి. కోకిల అంచెలేకుండా కూస్తుంటే... ఆ కూత అర్ధాలు తెలిసిపోతుంటే వల్లు గలపొడిచి... సిగ్గేస్తుంది... అరే! ఎంత తేట తెల్లం!
'అంబా' అన్న దీర్ఘంకే పొదుగుల్లో పాలు పొంగారుతున్నాయి. మేక పొదుగు గుద్దుతున్న పిల్లమేకకు, ఎదిగితే... మెడమీద కత్తిపడే యోగం దగ్గర పడుతుందని తెలవదు దానికి. మేకపోతు మెడెత్తి గంభీరంగా అగపడుతుంది. గొర్రెతల దించుకుని కత్తి అంచుదాకా వున్న కాలాన్ని గడిపేస్తుంది.
కోడిపెట్ట రెక్కల మాటున దాగున్న 'చికెన్లు'... బొకబొక నవ్వుతున్నట్టున్నాయి - కొద్దికాలంలోనే చావడానికి సంతోషిస్తున్నట్లు! పెద్దొరస కోడిపుంజు జుత్తును మేస్తున్న ఆకాశం - లోకాల గోడంచున ఆరేసిన ఎర్రకోకలా వుంది. పందెంకోడి కాలి 'ఆరె' సూర్యకిరణంలాగా సూటిగా సూదిగా వుండి విరోధిపైకి ఎక్కుపెడుతోంది. కడుపున సూది ముక్కును దించుతున్న దోమను, తోకతో ఒక్క దెబ్బ కొట్టింది దున్నపోతు. తాడిచెట్టు కాండానికి కొమ్ములున్న తిగిడి (రాసి) పాటుకు సిద్ధమని చెబుతున్నాయి ఎడ్లు తమ మూగ తెలుగు భాషలో.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|