|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
హాల్లో కూర్చున్న శంకర్రావు మరీ అసహనంగా ఉన్నాడు. ఫోన్ సరిగ్గా క్రెడిల్ అయిందో లేదోనని రెండుసార్లు పరీక్ష చేసొచ్చాడు. చేతిలో పేపరు చదవడానికన్నట్లు పట్టుకుని చెవులని ఫోన్ శబ్దానికి అప్పగించేశాడు. శబ్దం చెవులకి వినపడదేమో అన్నట్లు మధ్యలో పేపరు దించి ఫోన్ వంక చూస్తూ కూర్చున్నాడు.
ఆఖరికి వారి నిరీక్షణ ఫలిచింది. ఫోన్ మోగింది. పది నిముషాల వ్యవధిలో కొడుకులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. కోడళ్ళు, పిల్లలు అందరి క్షేమ సమాచారాలు అయ్యాయి.
అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? చిన్న కొడుకు బాబీ కుశల ప్రశ్నలు వేశాడు.
ఏముందిరా... పొద్దున్నే పూజయింది. మరింక భోజనాలు చెయ్యాలి.
కొడుక్కి అర్థమైంది భోం చేశాక మరింక వాళ్ళకి చేసే పనేం ఉండదు.
మళ్ళీ ఆదివారం పొద్దున్న వరకూ ఇవాళ తాము మాట్లాడిన మాటలే మళ్ళీ, మళ్ళీ తల్చుకుని, ఒకటికి రెండర్ధాలు తీసుకుని, బెంగపెట్టుకుని, ఒకరినొకరు ఓదార్చుకుని, లేకపోతే ఒకరిని ఒకరు అరుచుకుని, మనవళ్ళ ముద్దుముచ్చట్లు ఒకటికి పదిసార్లు చెప్పుకుని కాలక్షేపం చేసుకుంటారు. బాబీకి బాధగా అనిపించింది. ఏం చెయ్యగలడు? ఇక్కడి జీవితానికి అలవాటు పడిపోయేడు.
నెమ్మదిగా తల్లితో అన్నాడు అమ్మా... నువ్వూ, నాన్నా కూడా ఇన్నాళ్ళూ కాలమంతా మమ్మల్ని ప్రయోజకుల్ని చెయ్యడానికే కష్టపడ్డారు. మీ గురించి మీరు ఆలోచించుకోలేదు. ఇప్పుడు మేం సెటిలయ్యాం కనక ఇప్పుడైనా నువ్వూ, నాన్నా హాయిగా ఎంజాయ్ చెయ్యండి అన్నాడు.
ఎంజాయ్ చెయ్యడం అంటే... వెంటనే అడిగింది సుమతి.
మేం బాగానే ఉన్నాం... ఉంటాం కూడా. మీకు దగ్గరగా లేమన్న బాధ తప్పితే వేరే సమస్యలేం లేవు. మాకు క్షణం తీరుబడి ఉండదు. మీకు ప్రతిక్షణం మా గురించే ఆలోచన. మీరు మా గురించి ఆలోచించి వర్రీ అయి ఆరోగ్యాలు పాడుచేసుకోవడం తప్పితే దానివల్ల ఎవరికేం లాభం చెప్పండి? మీ చేతిలో ఉన్నంత వరకు మమ్మల్ని బాధ్యతగా పెంచి పెద్దచేశారు. ఇంక నువ్వూ, నాన్నా హాయిగా ఎంజాయ్ చెయ్యండి... ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నాడు.
కొడుకుతో మాట్లాడేక సుమతికీ, శంకర్రావుకీ కూడా కొడుకు మాటల్లో సత్యం ఉందనిపించింది.
నిజమే... రెక్కలొచ్చిన పక్షులు. వాటి గూడు అవి కట్టుకుంటాయి. లోకధర్మం... తమకి కాళ్ళూ, చేతులూ బాగానే ఉన్నాయి. డబ్బుకి లోటు లేదు. దుర్వ్యసనాలు లేవు. బి.పి, షుగర్ లాంటి జబ్బులు లేవు. మరింక కొడుకన్నట్టుగా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు కదా... కాని ఎంజాయ్ చెయ్యడమంటే ఏంటి? ఎలా? ఇన్నాళ్ళూ పిల్లల్ని పరీక్షలకు చదివించడాలూ, మంచి ట్యూషన్లు వాకబుచేసి కుదర్చడాలూ, పరీక్షల్లో వాళ్ళతో పాటు మేలుకోవడాలూ, రిజల్ట్సు వచ్చే టైముకి పిల్లలకన్నా ఎక్కువగా టెన్షన్లు పెట్టుకోవడాలూ, పై చదువులకి పంపించడాలూ, వాళ్ళ ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ వాటన్నింటితో ఒకదాని తర్వాత ఒకటి బిజీగా ఉండేవారు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|