|
|
Articles: TP Features | ప్రాకృతంలో 'తెలుగు' నాడి - Site Administrator
| |
ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొన్న 'ఆంధ్ర' పదం జాతి వాచకమని అందరూ అంగీకరించిన సత్యమే. ఆంధ్రులు నివసించిన స్థలం ప్రాకృతంలో 'అంధక' ప్రాంతం అని పేరొందినది. 'అంధక' పదమే సంస్కృతంలో 'ఆంధ్ర' అయింది. 'అంధక రట్ట' పదమే 'అంధాపథ' అని వ్యవహరించారు. దీనికి ఉదాహరణగా మైదవోలు శాసనాన్ని చరిత్రకారులు పేర్కొన్నారు.
జాతిగానే కాకుండా గోదావరి, కృష్ణానదుల పరీవాహక ప్రాంతంలో గల ప్రదేశాన్ని కూడా 'అంధక' అని పిలిచినట్లే అదే పదాన్ని భాషా సూచిగా కూడా వాడారు.
ఈ విషయం కూడా బౌద్ధ వాంగ్మయంలో తలమానికమైన బుద్ధఘోషుడు రచించిన 'మజ్జిమనికాయం' పై రచించిన వ్యాఖ్యానం 'ప్రపంచ సూదని' గ్రంథంలో '... దమిళ అంధకాది దేశభాషల్లో బౌద్ధ పిటకములను అనువదించారని' పేర్కొన్నారు. అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం కాలం నాటికే 'అంధకము' ఒక సాహిత్య భాషగా రాణించినట్లుగా తెలుస్తున్నదని 'తెలుగు మరుగులు' గ్రంథంలో వివరించారు.
ఇంకా ఈ విషయాన్ని వివరిస్తూ - హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ గ్రంథం (ప్రచురణ - భారతీయ విద్యాభవన్ సంపుటం - పేజి 396)లో పాలీ భాషా పండితుడు నలినాక్షదత్తు తెలుగు భాష ప్రాచీన రూపమే 'అంధకము' అని చెప్పాడు. ఇలాంటి పలు విషయాల్ని సహజంగా ప్రాకృతానికి పోటీగా నిలిచిన సంస్కృత సాహిత్యం (వైదిక సాహిత్యం) ఎక్కడా ప్రస్తావించలేదు.
జైన, బౌద్ధ సాహిత్యాలు ఈ విషయాన్ని రూఢి పరుస్తుండగా వైదిక సాహిత్యం మాత్రం దీన్ని మరుగు పరచింది. పైగా జైన, బౌద్ధ మతాలు అంధక రట్టంలో వెనకపట్టుపట్టాయి. అంతేగాదు ఆ సాహిత్య గ్రంథాలను నామరూపాలు లేకుండా చేయడం జరిగింది. అందువల్ల మరిన్ని వివరాలు అందే అవకాశం లేకపోయింది.
శాతవాహన రాజులకు ముందు, ఆ తరువాత కానవస్తున్న చాలా పేర్లు తెలుగు శబ్దాలే. వాటికి కొందరు సంస్కృత సమశబ్దాలను సూచించినా వాటికి అర్థం విప్పలేకపోయారు. అలాంటి పదాలు, పేర్లలో 'పులుమావి' ఒకటి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|