|
|
Articles: TP Features | తెలుగువారికి మూడు రాష్ట్రాలు - Site Administrator
| |
అక్కడ కోస్తా, సీమ ప్రాంతాలను ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ భూములను కొల్లగొట్టి సంపాదించిన వీరి ఆస్తిపాస్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇది కేవలం ఆస్తులు కూడబెట్టిన రాజకీయ వాదుల దుగ్ద, ఉక్రోషం తప్ప ఇంకేమీ కాదు. ఒక శాసనసభ్యుడు అవినీతికి పాల్పడకపోయినా ఐదేళ్ళలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అనుకునేవారి సంపాదనకు అంతే ఉండదు. ఆ అక్రమ సంపాదనను రక్షించుకోవడానికే వారు రాజీనామాలకు పాల్పడింది, సమైక్య ఆంధ్ర రాజకీయాలు చేస్తుంది.
తెలుగు మాట్లాడే వారికి రెండు లేదా మూడు రాష్ట్రాలు ఉంటే నష్టం ఏమిటి? తెలంగాణ వారు మీ సాంగత్యం వద్దు అని చెప్తున్నా 'మేము మీతోనే కలిసి ఉంటాం', 'తెలంగాణ వద్దు సమైక్యాంధ్రా ముద్దు' అని పెద్ద బ్యానర్లు పట్టుకొని ధర్నాలు చేయడం, చేయించడంలో అర్థం ఏమిటో అందరికీ సులువుగానే అర్థం అవుతుంది. వీరి చర్యలను ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజాసంఘాలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఎందుకని విశ్లేషించడం లేదు. ఆ ప్రాంతంలో బుద్ధిజీవులే లేరా, వారు కూడా పాలక వర్గాల సేవకే హైదరాబాద్ తరలి వచ్చేశారా.
స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే వాటిని మెచ్చుకునేవారు చిన్న రాష్ట్రాలను ఎందుకు వద్దంటారు. 'వెయ్యేళ్ళున్నా వేరు తప్పదు, నూరేళ్ళున్న చావు తప్పదు' అనే సామెత మనకు ఉండనే ఉన్నది. ఉమ్మడి కుటుంబాలను ఎవరు కోరుకోవడం లేదు. పెళ్ళి అవగానే పెళ్ళికూతురితో సహా అందరూ వేరు కాపురం పెట్టుకోడమే మేలు అని నమ్ముతున్న కాలం ఇది. ఈ కాలంలో చిన్న రాష్ట్రాలను ఎందుకు వద్దనడం?
పెద్ద రాష్ట్రాలు ఎప్పుడూ పాలకవర్గాలకే మేలు కలిగిస్తాయి. వారికే లాభాల పంటలు పండిస్తాయి. అందుకే పాలకవర్గాలు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. గ్లోబలైజేషన్, మల్టీనేషనల్స్ ప్రజలందరినీ మహామాయలో పడవేస్తుండగా మనం స్వల్ప విషయాలపై స్పష్టత పెంచుకోకపోతే ఎలా? సావధాన దృష్టితో యోచిస్తే చిన్న రాష్ట్రాలు ప్రజలకు మేలు కలిగిస్తాయో, ఇబ్బందులు తెచ్చిపెడతాయో అన్నది తెలుస్తుంది. రాజకీయ వాదుల వాదనలను, చర్యలను, యథాతథగా నమ్మాల్సిన అవసరం లేదు. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు సావధాన దృష్టితో ఆలోచించి జనాలను విజ్ఞత వైపు నడిపించాలి. ఎందుకంటే ఈ పనిచేయాల్సిన రాజకీయ వాదులు, అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి కాబట్టి.
| Read 9 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|