|
|
Articles: My Thoughts | భోగి విశేషం - Site Administrator
| |
భోగిపళ్ళ కోసం వాడే రేగుపండును సంస్కృతంలో అర్కఫలం అంటారు. అర్క అనే పదానికి సూర్యుడు అని అర్థం. ఎర్రగా ఉదయభానుడిలా ఉంటుంది రేగుపండు. ఆ పండ్లను పిల్లల శిరస్సు మీదుగా మెల్లగా జారవిడుస్తారు. దాంతో సూర్యశక్తి ఆ పిల్లలకు ప్రసరించాలన్నది ఈ ఆచారం వెనుక ఉన్న భావన. సూర్యుడు బుద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడంటారు. ఆ రెండూ తమ పిల్లలకు ఉండాలని పెద్దలు అలా ఆశీర్వదిస్తుంటారు.
సంక్రాంతి అంటేనే మకర సంక్రమణం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం అని దీని అర్థం. ఇలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేటప్పుడు తమ పిల్లలకు ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు ఇవ్వాలని పెద్దలు కోరుకొనే కోరిక దీని వెనుక ఉంది. భోగి పళ్ళంటే సంప్రదాయబద్ధంగా రేగుపళ్ళు మాత్రమే. మరైతే వాటితో పాటు కొంతమంది చెరకుముక్కలు, చిల్లర పైసలు, పువ్వులు, శనగలు లాంటివన్నీ కూడా జత చేస్తుంటారు. ఇదంతా అసలు సంప్రదాయానికి అనంతర కాలంలో వచ్చిన మార్పే తప్ప ఇక్కడ ప్రధానం రేగుపళ్ళు మాత్రమే. మిగతా చేర్పులు, కూర్పులు అన్నీ ఎవరి మనసుకు నచ్చినట్టు, ఎవరి సంతోషానికి, నమ్మకానికి తగ్గట్టు కాలానుగుణంగా వచ్చి చేరినవేనని పురాణజ్ఞుల భావన.
మరో ప్రాముఖ్యం :
భోగిపళ్ళకు మరో ప్రాముఖ్యం కూడా ఉంది. ఈ రోజునే ఆండాళ్మాత శ్రీరంగనాథుడిని వరించింది. ఆనాటి గోదామాత కల్యాణ శుభ సమయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పటికీ భోగి రోజున గోదారంగనాథుల కల్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. శ్రీరంగ నాధుడినే భర్తగా పొందాలని గోదాదేవి సంకల్పించి తిరుప్పావై (ధనుర్మాస వ్రతం) చేసింది. స్వామి కూడా గోదా మాతను అనుగ్రహించాడు. ఆండాళ్ళమాత పెళ్ళికూతురై సంప్రదాయ బద్ధంగా వచ్చి రంగనాథాలయంలో స్వామి పాదాల వద్దకు చేరి ఆయనకు ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైంది. ఇలా గోదా కల్యాణం జరిగింది. భోగినాడే ఈ పవిత్రోత్సవం ఆస్తిక జనులందరికీ ఎంతో హర్షదాయకం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|