|
|
Articles: TP Features | స్వర్గం-నరకం...ఎక్కడ? - Site Administrator
| |
ఇదంతా ఏమిటీ? చిత్తభ్రమా? కాదు... కాదు... మనతో మన అంతరంగం ఆడుకునే ఆట. మన మస్తిష్కం చేసే మాయ. మనస్సు చేసే ఇంద్రజాలం. హృదయ మైదానంలో త్వరితంగా మారిపోయే వర్ణాల క్రీడ. కేవలం భావనలో వచ్చే చిన్న మార్పు... మన ఉద్వేగాలు మనల్ని ఉసికొల్పుతూ ఉంటాయి. ఉస్సూరుమనిపిస్తాయి... ఊరడిస్తాయి... మనోభావాల మాయాజాలం.
నాకు తెలిసిన అందరూ ఇలానే చెబుతూ ఉంటారు : ఆ రోజుల్లో అంటే నేను మంచి వయస్సులో ఉన్నప్పుడన్నమాట. సెలవలు వచ్చాయంటే చాలు.. అబ్బో ఒకలాంటి అల్లరి కాదు... ఎంత సంతోషంగా గడిపేవాళ్ళమో... మా ఊర్లో అమ్మాయిలు నన్ను చూసి తెగ లైనేసేసే వాళ్ళు. మనం మాత్రం తక్కువ తిన్నామా? ఔను మరి 'గతం ముదిమికి విందు' కదా?
కానీ ఇలా డచ్చాలు కొట్టే ఈ పెద్దమనిషి నిజానికి యువకుడిగా ఉన్నప్పుడు చాలా లావుగా ఉండే వాడు. సెలవుల్లో రోజులు ఎలా గడపాలో తెలీక బోర్ బోర్ గా ఉండేది. పరమ చిరాగ్గా గడిపేవాడు. మొహం అంతా నల్లగా మాడిపోయి, జబ్బు పడిన కుక్కలాగ మునగదీసుకుని పడుకుని ఉండేవాడు. సెలవలన్నీ అలాగే గడిచేవి... గమ్మత్తుగా అదంతా మరచిపోతాం. ఆ రోజులు సుఖదాయకమనే మైకంలో మైమరిచిపోతాం. 'ఆ మంచి రోజులు' ఆలోచన ఇచ్చే మత్తులో చిక్కుకునిపోతాం.
జనాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలనుకుంటారు. డబ్బులూ దండీగానే కావాలనుకుంటారు. విజయాల మీద విజయాలు తన్నుకొచ్చేయాలనుకుంటారు. అప్పనంగా అధికారం చెలాయించాలనీ తహతహలాడుతారు. అత్తగారి ఆస్తికి తానొక్కడిగా మిగిలిపోవాలనుకుంటారు. వీరిలో చాలా మందికి 'సంతోషం' అనేది ఈ జాబితాలో అగ్రభాగానే ఉంటుంది. దాని గురించి తరచి తరచి చూడండి. అది అందీ అందని చందమామలా మనతో దోబూచులాడుతున్నట్లు కనిపిస్తుంది. తికమకపెడుతూ ఉంటుంది. ఊరిస్తూ ఉంటుంది. ఉడికిస్తూ ఉంటుంది.
నాకో మిత్రుడుండే వాడు. వాడికి ఆడి కారంటే చచ్చేంత ఇష్టం. దాన్ని గాని వీడు గాని కొనగలిగితే వీడి సంతోషానికి హద్దులుండవని నేను అనుకుంటూ ఉండేవాడిని. వావ్! నిజంగానే వాడు ఆడి కారు కొనేశాడు. కానీ సంతోషమే కనిపించలేదు. దానికంటే కారు కొనడానికి తీసుకున్న బ్యాంక్ లోన్ వాయిదాల బెంగ వాడిని పట్టుకుంది. అలా మోజుపడి తాను కొనుక్కున్న అన్నింటికీ పడ్డ బకాయిలను తీర్చీ పనిలో సతమతమవుతున్నాడు. కానీ మనం కొనడంతో వచ్చే ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాం. మనం చాలా మోజుపడే దానిని కొనడం గురించి ఆలోచిస్తూ ఎలా కొనాలో ప్రణాళికలు వేస్తూ ఆ ఊహాలోకపు ఆనందంలో ఈదుతూ ఉంటాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|