నేను కాను నాస్తికుణ్ణి. ఆస్తికుణ్ణి అవును. కాని ఆలయాల్ని పట్టుకు వేలాడను. దైవ సాన్నిధ్యం కోరుతూ దేశాలు తిరుగాడ మనసు లేదు. కదిలే ప్రతి ప్రాణినీ దైవంగా భావించే మనసున్న ఓ సామాన్యుడిని. మూడు కాళ్ళ ముసలిని దైవంగా భావించి సాయం అందించేందుకు ప్రయత్నిస్తా. కళ్ళు లేని కబోదిని దైవంగా భావిస్తా. చేతనైనంత ఆదుకునేందుకు ప్రయత్నిస్తా. కటిక దారిద్ర్యంలో దైవాన్ని చూస్తాను. కడగండ్ల పాలైన దీనుల్ని ఆదుకోవడంలో దైవ సేవ ఉందనుకుంటాను. ఆకలి కేకల్ని ఆర్పి ఓదార్పునివ్వగలిగితే దైవారాధనగా భావిస్తా. పసిపాపల చిరునవ్వుల్లో దైవ దర్శనముందని నమ్ముతున్నా. మరణావస్థలో ఉన్న మనిషి సేవలో దైవానుగ్రహం పొందగలనని అనుకుంటా. అంటరానితనాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో దైవానుగ్రహం ఉందని భావిస్తా. ధనం దాచుకోవటం కంటే దాన్ని సద్వినియోగ పరచడంలో దైవ స్వరూపం ప్రస్ఫుటమవుతుంది. దైవానుగ్రహం పొందే మార్గాలు ఇన్ని ఉన్నా నాకు గుళ్ళనీ గోపురాలనీ యాత్రలనీ తీర్థాలనీ కాలం వృథా చేయటం మంచో చెడో నాకు తెలియదు. కాని, తెలిసినంతవరకూ ఆపదలో ఉన్న ప్రతివారినీ ఆదుకోవటం నా అభిమతం. దైవమెక్కడ లేడు? అమ్మ కడుపులో జీవం పోసుకునే పాపలో దేవుడే. పాపకు జన్మనిచ్చిన అమ్మలోనూ దేవుడే. మానవ మనుగడలోనూ దైవమే. కదలాడే ప్రతి ప్రాణిలోనూ దైవమే. అమ్మ పెట్టే ప్రతి బువ్వలోనూ దైవమే. నీ నా ప్రతి అడుగులోనూ దైవమే..