(చుక్కా రామయ్య)
తెలుగు చదివితే ఏమొస్తుందిరా?... 'ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు' అని రాసిన పలకలను పిల్లల మెడలో వేసి శిక్షించిన సంఘటన ఘోరమైనది. తెలుగు అధికారభాషయని దానికి ఇటీవలే ప్రాచీనభాషా హోదా దక్కిందని చెప్పుకుంటున్నాం. హక్కుల కమీషన్ కూడా 2005లో భాషా సంస్కృతుల పరిరక్షణకై స్పష్టమైన తీర్పు నిచ్చింది. తెలుగు అధికారభాష అని ఎన్నో ఉత్తర్వులున్నాయి. ప్రభుత్వ చట్టాలు, ప్రజల ఆత్మాభిమానానికి విరుద్ధంగా కడప జిల్లా మైదకూరులో సెయింట్ జోసఫ్ హైస్కూల్లో పిల్లలు తెలుగులో మాట్లాడితే అవమానపర్చటం జరిగింది. ఇది తెలుగు ప్రజలను తీవ్రంగా కలత పర్చింది.
ఈ పైశాచిక కృత్యం సభ్యసమాజానికే కాదు. ప్రపంచ మానవాళికే సిగ్గుచేటు. పిల్లలు బడిలో అడుగుపెట్టగానే పంజరంలో చిలుకలు కారు. మనం చెప్పిన రెండక్షరాలను వల్లెవేసే జీవులు కాదు. పిల్లలు మనమాదిరిగానే ఆలోచించే మనుషులు. మనలాగే భావాలను వ్యక్తం చేసే భావుకత ఉన్న సృజనశీలురు. వారు నూతన సమాజ సృష్టికర్తలు.
మనిషికి కక్కొచ్చినా ఆగదు, భావమొచ్చినా ఆగదు. కక్కేటప్పుడైనా, భావాలను వెలిబుచ్చేటప్పుడైనా, చమత్కరించేటప్పుడైనా తన చుట్టుపక్కల ప్రకృతిని పోల్చుకుని, తన స్థానికత నుంచి మాట్లాడతాడు. ఇప్పటికీ నా వరకు నేను చమత్కరించేటప్పుడు వచ్చీరానీ తెలుగు భాషలోనే చెపుతాను. హైద్రాబాద్ లో రోడ్డుపై తిరుగుతుంటే ఇలాంటి చమత్కారాలు, ముచ్చట్లు ఎన్నో కనబడతాయి. అదే విధంగా పిల్లలు తనకొచ్చినటువంటి భావనను తోటి పిల్లలతో చెప్పుకోవటానికి మన మాతృభాషనే సాధనంగా చేసుకుంటారు. ప్రపంచంలోని సామాజిక వేత్తలందరు దీన్ని అంగీకరిస్తారు. మాతృభాషను ఆదరించమని పదేపదే చెపుతున్నారు. మాతృభాషను ఒక హక్కుగా గుర్తిస్తారు.
|