చెల్లెలు షమితా శెట్టి లేకుండానే శిల్పా శెట్టి నిశ్చితార్ధం ఇటీవల రాజ్ కుంద్రాతో జరిగింది. 'బిగ్ బాస్ 3' కోసం షమిత కొద్దికాలంగా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఓ రూమ్ లో ఉండాల్సి రావడంతో ఈ నిశ్చితార్ధం ఆమెకు తెలియకుండానే జరిగిపోయింది. ఇప్పుడు తప్పితే మళ్లీ మరో నాలుగు నెలల వరకూ పెళ్లి ముహూర్తాలు లేవనడంతో రాజ్ కుంద్రాతో శిల్ప వివాహం సైతం ఈనెల 22న పెద్దలు నిశ్చయించారు. షమిత ఎప్పుడెప్పుడు 'బిగ్ బాస్ 3' నుంచి బయటకు వస్తుందా అని ఎదురచూస్తున్న శిల్పను ఇప్పుడు షమిత సంతోషంలో ముంచెత్తుతోంది. షమితా శెట్టి ఈ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చేయడమే ఇందుకు కారణం. షమిత స్వచ్ఛందంగా రియాల్టీ షో నుంచి తప్పుకున్న ఘట్టాన్ని ఈ శనివారం ప్రసారమయ్యే 'రియాల్టీ షో'లో చూపించనున్నారు.
'అక్క పెళ్లి అనగానే ఆనందం తట్టుకోలేకపోయాను. అన్నింటికంటే నా కుటుంబమే నాకు ముఖ్యం. అక్కతో జాయిన్ అయ్యేందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రియాల్టీ షో నుంచి బయటకు వచ్చేశాను' అంటూ షమిత ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. షమిత రాకతో శిల్పా వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇప్పడు మరింత గ్రాండ్ లుక్ సంతరించుకోనుంది.