యుఎన్ అంబాసడర్ గా సచిన్ ఐక్యరాజ్య సమితి : భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండుల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమానికి (యుఎన్ఇపి) గుడ్ విల్ అంబాసడర్ గా సచిన్ ను నియమించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన తొలి క్రికెటర్ గా సచిన్ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ప్రజాభిమానం సచిన్ పురిటిగడ్డ భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను పర్యావరణంపై ప్రజల్లో చక్కని అవగాహన కలగించడానికి, పర్యావరణ పరిరక్షణకు చక్కగా ఉపయోగపడుతుందని శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో యుఎన్ఇపి అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా టెండుల్కర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ భూమిపై క్రికెట్ ఆడుతూ తాను అపరిమితానందం పొందుతున్నానన్నాడు. మనందరికీ ఇంత చోటు కల్పించిన ఈ భూమి కోసం ఇక ఇప్పుడు తాను ఏదైనా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భూమి పరిరక్షణ అందరి ముందున్న ప్రధాన లక్ష్యం అన్నాడు. తనకు లభించిన సరికొత్త బాధ్యత ద్వారా వాతావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నాడు. యుఎన్ఇపితోను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి అభిమానులతోను కలిసి పనిచేయడం ద్వారా లక్ష్యం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు.
మంచి లక్షణం, మనో పరిపక్వత, వివేకం, వ్యక్తిత్వం ఉన్న టెండుల్కర్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు చక్కని ప్రచారం లభిస్తుందని, ఎక్కువ శాతం మందిలో అవగాహన కలుగుతుందన్న ధీమాను యుఎన్ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిం స్టీనర్ వ్యక్తం చేశారు. 2010 యుఎన్ అంతర్జాతీయ బయో డైవర్శిటీ సంవత్సరాన్ని పురస్కరించుకొని సచిన్ తమ సంస్థతో కలిసి పనిచేయడం హర్షదాయకం అన్నారు. జంతు సంతతి క్షీణించడం వల్ల ప్రపంచ పర్యావరణంపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతున్నదీ అత్యంత కింది స్థాయి ప్రజల్లో కూడా సచిన్ ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. సచిన్ టెండుల్కర్ గతంలో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) తరఫున ప్రచారం చేశాడు.
ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసడర్ గా సచిన్ నిర్వహించాల్సి ప్రధానమైన విధుల్లో భూమిపై పర్యావరణాన్ని కాపాడతామంటూ 'గ్రీన్ ప్లెడ్జ్'పై ప్రమాణం చేయిండం. ముంబాయిలోని డివై పాటిల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ముంబాయిలో ప్రారంభమవుతున్న మూడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఉత్సవంలో ఈ ప్రమాణాన్ని చేయిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీల్లో తిలకిస్తుండగా గ్రీన్ ప్లెడ్జ్ ను సచిన్ నిర్వహిస్తాడు. 'The Earth is our home and together we must conserve our precious wildlife, forests and oceans. I am proud to pledge that I will play my part in caring for our natural heritage' అంటూ సచిన్ గ్రీన్ ప్లెడ్జ్ ప్రమాణం చేయిస్తాడు.
News Posted: 11 March, 2010
|