తెలంగాణాకు బాబు సిగ్నల్! హైదరాబాదు: టీడీపీపై రాజకీయ దాడి కాంగ్రెస్-టీఆర్‌ఎస్ కుట్రేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం ఉదయం తెలంగాణ టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నుంచి టీడీపీని బహిష్కరించడంపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు. ఇకపై తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సొంత ఉద్యమం చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణా నాయకులకు బాబు గ్రీన్ సిగ్నలిచ్చినట్లు తెలిసింది.
కాంగ్రెస్-టీఆర్‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని టీడీపీ బహిష్కరణతో బయట పడిందని బాబు అన్నారు. టీడీపీ వెళ్లగొట్టాక అది తెలంగాణ జేఏసీ కాదని, కేవలం టీఆర్‌ఎస్ జేఏసీగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీని, తెలంగాణ నినాదాన్ని కాపాడుకోండని తెలంగాణ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. జేఏసీ కేవలం టీడీపీనే ఎందుకు టార్గెట్ చేస్తోందని, తమ పదవులకు రిజైన్ చేయని కాంగ్రెస్ నేతలను జేఏసీ ఎందుకు నిలదీయడం లేదని, విజయశాంతి, కేసీఆర్ కూడా రాజీనామా చేయలేదని, మరి టీఆర్‌ఎస్‌ను ఎందుకు బహిష్కరించలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
News Posted: 13 March, 2010
|