పదవి కోసం కాదు: జెసి హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే పక్షంలో రాయలసీమను తెలంగాణాలో కలపాలన్న తన ప్రతిపాదన వెనుక పదవీ స్వార్ధం లేదని, రాయలసీమ ప్రాంతం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అలా అన్నానని మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరగాల్సి వస్తే తెలంగాణతోనే రాయలసీమను కలిపి ఉంచాలని ఇటీవల జరిగిన సీమ ఎమ్మెల్యేల సమావేశంలో జెసి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఇటు తెలంగాణ ప్రాంతనేతలే గాక అటు రాయలసీమ నేతలు కూడా వ్యతిరేకించారు.
తాను చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంత అవసరాల కోసమే చేశానని, రాష్ట్రం విడిపోతే తమ ప్రాంతం నీటిపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు గతంలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు కలిసుండేవని, ఇప్పుడు కూడా అదే చేస్తే ఎలా ఉంటుందని ప్రతిపాదించాను తప్ప తనకు మరే అవసరం లేదని తెలిపారు. తెలంగాణను వేరుచేయాలని కేంద్రం భావిస్తే ఎక్కడో ఒకచోట రాయలసీమను కలుపుతారు కదా! అదేదో తెలంగాణలోనే కలిపి ఉంచాలని కోరానని, దానికి విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదని అన్నారు. తాను సమైక్యవాదినేనని, మొట్టమొదట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది కూడా తానేనని, సమైక్యాంధ్రను వదలబోమని అన్నారు.
News Posted: 13 March, 2010
|