|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
ఒక్కసారయినా ఆ చోటుకు పోయి రావాలి. అవును, ఎత్తయిన కట్ట మీద నిలబడి ఆ పెద్ద చెరువందాన్ని తనివితీరా చూసి పలవరించాలి. నిజంగానే పెద్ద చెరువది. ఎంత పెద్దదంటే అనంతమైన ఆకాశాన్నేతన చిన్ని కౌగిలిలో పొదువుకొనేసింది. చెరువు కట్టుకొన్న నీలి కోకకు దవ్వునున్న కొండ నీడ పచ్చటి అంచయింది. తన చుట్టూ ఉన్న పల్లెలకు ఆ చెరువు తల్లయింది.
ఆ మాటకొస్తే ఏ చెరువైనా అంతే కదా. వానాకాలాన యాగటయిన చెరువు సలికాలపు సగాన పురుడుబోసుకొని పంటల పసిబిడ్డలను కంటుంది. ఎండి వట్టిబోయిన ఎండకాలాన పసివాళ్లకు ఆటబయలవుతుంది, పసుల మందలకు మేత బయలవుతుంది.
అయితే ఆ చెరువు అన్ని చెరువుల్లాగా కాదు. ఆ చెరువుకొక వేరు మరియాద ఉంది. ఆ దేశాన ఎక్కడా కానని వింతమానుల గుంపును ఆ చెరువంచున మనం చూడొచ్చు. ఆ దేశాన ఇంకెక్కడా వినలేని యాసబాస ఒకటి మన చెవిన బడుతుందక్కడ. మాపటివేళ మునిముని మబ్బులో పొయ్యి పై నుంచి లేచి వచ్చిన చేపల పులుసు పరిమళం మనల్ని హత్తుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పొద్దుపోయి ఊరు సద్దుమణిగిన వెనుక సోమరిగాలిపై తేలుతూ వచ్చిన లాలిపాట కాసింతసేపు మన పసితనాన్ని గురుతుచేసి అమ్మలా ఒళ్లు తడుముతుంది. మనవడు నిదరపోయిందెరుగక చెబుతూ పోతున్న తాతకు గున్నమానుపైన గువ్వ ఊకొడుతుంటే ఆ మెత్తని మూలుగు మనను జోకొడుతుంది. ఇదంతా మన అమ్మబాసలోనే. అవును నమ్మండి. నిదర, మెలకువ, బతుకు, చావు అన్నీ అమ్మబాసలోనే. అంతా కమ్మని తెలుగులోనే ఆ చెరువంతా.
ఆ చెరువు మనరాష్ట్రంలో లేదు. మన పొరుగునాడులలో ఉన్నదీ కాదు. మన దేశపుది అసలే కాదు. శ్రీలంకలో అనురాధాపురం జిల్లాలో ఉందా చెరువు. చెరువు చుట్టూ తెలుగు పల్లెలు. పల్లెల నిండా పాములనాడించి బ్రతుకుతున్న తెలుగు అహికుంటికలు. వాళ్లను మీకు పరిచయం చేద్దామని ఈ ముచ్చట మొదలుపెట్టినాను.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|