|
|
Articles: TP Features | గుణపాఠం ఇంకెప్పుడు? - Prof. Sundaram RVS
| |
పత్రికలలో ఇటీవల ఒక వార్త వచ్చింది. భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ తోషిహైడ్ మస్కావా అనే జపనీస్ భౌతిక శాస్త్రవేత్త తనకు ఇంగ్లీషు రాదని, అందుకే ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళలేదని చెప్పారు. 68 ఏళ్ళ మస్కావాను 'ఇంత గొప్ప నోబెల్ పురస్కారాన్ని పొందారు కదా, ఈ పతకాన్ని ఏం చేస్తారు' అని అడిగితే 'ఓ గొయ్యి తవ్వి, అందులో పాతిపెడతా' అని వ్యాఖ్యానించారు. ఇవి సరదాగా అన్నమాటలే అయినా దీనివల్ల నేర్చుకోవలసిన గుణపాఠం ఎంతో ఉంది.
ఇంగ్లీషులో చదవకపోతే భవిష్యత్తే లేదని, జ్ఞానమూ విజ్ఞానమూ లభించాలంటే ఇంగ్లీషుకు దాసోహం అనాలని బోధిస్తున్న మన పాలకులకు, అందులోనూ ముఖ్యంగా ఉన్నత విద్యామండలికి పై పత్రికావార్తను చూపించాలి. ఇలాంటి వార్తలు వందలు, వేలు వచ్చినా మనవారికి కనువిప్పు కలుగుతుందనే ఆశ లేకున్నా తోషిహైడ్ మస్కావా గారికి మనసులోనే మరీమరీ నమస్సుమాంజలి అర్పిస్తున్నాను.
మస్కావా ఉదంతం వల్ల రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఎంత ఉన్నత విద్యనయినా, ఎంత ఉన్నత సాధననయినా ఇంగ్లీషు తెలియకుండానే పొందవచ్చు. 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న వేమన సూక్తిని మననం చేసుకోవాలి గాని సాధనకు పరాయిభాషే కారణమన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి. మరొక గుణపాఠం ఏమిటంటే పురస్కారాలు మనల్ని పొందాలి కాని పురస్కారాలను మనం పొందటమే గొప్ప అనుకోకూడదు. నేను సాధించింది గొప్పగాని, నోబెల్ పతకం గొప్పకాదు' అన్నది మస్కావా మాటల్లో ధ్వనిస్తోంది.
ఒక్క మస్కావాకే కాదు, ఆయనతో బాటు నోబెల్ బహుమతి అందుకున్న మకోటో కొబయాషి, యోచిరో నంబులకు గాని, అదే అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఎంతోమంది స్పెయిన్, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, చివరికి స్వీడిష్ దేశస్థులకు గాని ఇంగ్లీషు తెలియదు. నాకు తెలిసి భాషాశాస్త్రంలో, జానపద విజ్ఞానంలో, మానవశాస్త్రంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ప్రాప్, లెవిస్ట్రాస్ లాంటివారు వారి వారి భాషల్లోనే తమ సిద్ధాంతాలను రూపొందించారు. దీన్నిబట్టి తేలేదేమిటంటే తెలుగువారిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడం ముఖ్యం కాని 'మీరు ఇంగ్లీషు నేర్చుకుంటేనే మీకు ఆ స్థాయిని పొందే అర్హత లభిస్తుంద'ని అబద్ధాలు చెప్పటం మానెయ్యాలని.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|