|
|
Articles: TP Features | తెలుగునాడు - రేడు - Editor
| |
(డా.జె.వి.సత్యవాణి)
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతిభాషా, జాతీ తమ మూలాల్ని వెతికి పట్టుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నాయి. తెలుగుజాతి కూడా ఈ దిక్కుగా అడుగు ముందుకు వేస్తోంది. ఇటీవల సంగసాహిత్యంలో తెలుగు రాజుల ప్రస్తావన గురించీ అక్కడ కన్పించే ఇతర లక్షణాల గురించీ పరిశోధనలు జరుగుతున్నాయి. సంగ సాహిత్యం దాక్షిణాత్య భారత ప్రజల ఉమ్మడి సొత్తన్నది నిరూపితమయింది. స.వెం.రమేశ్ గిరిజన తెగల్నీ, వారు వలసపోయిన విధానాన్నీ ఇళ్ళ పేర్ల ఆధారంగానూ కుల పురాణాల ఆధారంగాను వివరిస్తూనే ఉన్నారు. అవి మానవశాస్త్ర పరంగా జరుగుతున్న పరిశోధనలు. చారిత్రక, భాషా రంగాల్లో కృషి చాలా జరగవలసి ఉంది.
తొల్కాప్పియం 'వడవేంగడం - తెన్ కుమరి ఇడయే ఇట్ట తమిళ్ కూరుంనల్లులగం' అంటుంది. అంటే ఉత్తరాన వేంగడం (తిరుపతి) దక్షిణాన తెన్ కుమరి (కన్యాకుమారి)ల మధ్య తమిళం మాట్లాడే మంచి లోకం ఒకటుందని, ఈ మంచి లోకంలో తమిళమే కాదు ఇతర భాషలు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది నుండి క్రీస్తుశకం 3వ శతాబ్ది వరకు ఏలిన శాతవాహనుల సామ్రాజ్యం ఒక పక్కనుండగా, వింధ్యకు ఇంకా దక్షిణాన శాతవాహన సామ్రాజ్యం ఎల్లకు వెలుపల చాలా చిన్న చిన్న రాజ్యాలుండేవన్నది చారిత్రక సత్యం. ఆ రాజ్యాలు ఎన్నో సంగసాహిత్యంలో వివరంగా ఉంది. ఆ చిన్న చిన్న రాజ్యాలను ఏలిన వారంతా తమిళులే కాదు ఇతరులూ ఉన్నారు. ఆ ఇతరుల్లో తెలుగువాళ్ళూ ఉన్నారు.
వేంగడానికి ఉత్తరాన, ఈశాన్యాన ఉన్న భూభాగం గురించిన ప్రసక్తి వచ్చినప్పుడల్లా అది నేటి ఆంధ్రప్రదేశ్ అన్నది నిర్వివాదాంశం. పత్తుప్పాట్టులో నూట్రవర్ కణ్ణర్ అనే కవి శాతవాహనుల ప్రసక్తి తెస్తాడు. ఉత్తరాన ఉన్న సామ్రాజ్యమంటాడు. దక్షిణాన అప్పుడప్పుడే చిన్ని రాజ్యాలు కలిసి మూడు రాజ్యాలుగా స్థిరపడటం ప్రారంభించాయి. అవే చేర, చోళ, పాండ్య రాజ్యాలు. సంగసాహిత్యంలో 'సెట్రరసర్ గళ్' అనే పేరుతో చిన్న చిన్న రాజ్యాలను ఏలిన రాజుల గురించిన వివరాలూ, వాళ్ళు చేసిన దానధర్మాల గురించీ, వాళ్ళ రాజ్యం, వీరం, శృంగారం వంటివెన్నో వర్ణితమయ్యాయి. మరి ఆ చిన్న రాజ్యాలూ, ఈ మూడు రాజ్యాలూ బలపడడానికీ మధ్య ఏం జరిగింది? ఈ ముగ్గురూ తమ రాజ్యాల ఎల్లల్ని విస్తరించుకుంటూ ఇతర చిన్న రాజ్యాల్ని తమలో కలిపేసుకున్నారు సరే, మరి ఇది ఎప్పుడు జరిగింది? ఈ మార్పుల్ని సూచించకపోయిన సంగసాహిత్యంలో ఈ రెండింటి ప్రస్తావనా ఉంది కనుక ఆ సాహిత్యం కాల నిడివి ఏమిటి? ఇవన్నీ ఇంకా జవాబులు వెతకాల్సిన ప్రశ్నలే!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|