|
|
Articles: TP Features | తెలుగుభాష రక్షాబంధనం - Mr. Tirumalarao Jayadheer
| |
భూమ్మీది ప్రతి జీవికి ప్రాణవాయువు అవసరం. మనిషికి సంస్కృతి రెండో ప్రాణవాయువు. గాలి లభించని మరో నిమిషం ప్రాణి చైతన్యాన్ని కోల్పోతుంది. అలాగే సంస్కృతి నుండి దూరమైన మనిషి నిర్జీవం అవుతాడు. కొత్త హోదా, కొత్త స్వభావం అనుభవించవచ్చు గాక ఆ మనిషిలోని మరో భాగం డొల్లగా మారుతుంది. బోలుతనం ఆవహిస్తుంది. సాంస్కృతిక మూలాల పునాది లేని మనిషి తత్కాలం గాజుపరికరం లోంచి పుట్టినవాడే కదా. ఎంత త్వరగా పుడతాడో అంత త్వరగా గిట్టడం కూడా సహజమే. నవ్య అస్థిత్వంలో ఇమడకపోవడమే జీవితం. ఒక గాలి ఆడనితనంలో జీవి ఆవేదన ఎంతటిదో అందరికీ తెలుసు.
ఇక్కడ మా బతుకు సమరంలో మాకు సంస్కృతి ఒక ఊతం. జాతి, చరిత్ర, మూలాలు మా నేల అనే సాంస్కృతిక బంధం మాకు ఊపిరి. మాకే కాదు. ఎవరికైనా. వీటికి దూరం అవుతున్నామన్న భావన తెలిసినవారు, దానిని గుర్తించిన వారు మాత్రం యాతన పడతారు. అలా గుర్తింపు లేనివాళ్ళు లేరని కాదు. వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. వాళ్ళ గురించి కాదు. సాంస్కృతిక ఆలంబన అవసరం తెలిసిన వాళ్ళున్నారు. ధనం, దర్పం, హోదాల కన్నా మించిన సాంస్కృతిక సాంత్వన ఒకటి ఉంటుందని పలవరించే వీరు వీటి కోసం నిత్యం తపనపడుతుంటారు. వీరిలో చదువు వచ్చిన వాళ్ళుంటారు. చదువురాని వాళ్ళుంటారు. పేదవర్గాల వారున్నారు. సంపన్న ధనికవర్గాల వారుంటారు. ఐతే వీరి వీరి సాంస్కృతిక స్వభావాలు వేరు వేరు కావచ్చు. కొందరిది పెట్టుడు సంస్కృతి కావచ్చు. మరికొందరిది పుట్టు సంస్కృతి అభినివేశం కావచ్చు. కొందరిది ఒక బృంద సంస్కృతి కావచ్చు. మరి కొందరిది జన సంస్కృతి కావచ్చు.
ఒక సాంస్కృతిక ఇష్టత నుండి కొందరు పరాయి సంస్కృతిలోకి పారిపోవచ్చుగాక. పైపై వేషభాషల అనుకరణ నటనలు కావచ్చు. ఐతే వాటి వెనుక ఒక బలీయ సామాజిక ప్రోద్బలం ఉంటుంది. కనిపించని ప్రేరకాలు, వత్తిడులు, శక్తులు పనిచేయవచ్చు. కాని ఎన్నడో ఒకనాడు భళ్ళున సాంస్కృతిక పొరలు బద్దలు కాగా నేల మీద కూలబడి తన మూలాలను ఏరుకొనే రోజు వస్తుంది. బలీయమైన పరాయి సంస్కృతిని నెత్తిన రుద్దగా ఇప్పుడు దాన్ని ఈసడించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలు. అదొక్కటే చాలు. బలీయతని ఛేదించలేకపోవచ్చు. అట్లని ఆమోదించినట్లు కాదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|