|
|
Articles: Poetry | అమ్మల గన్నయమ్మ - Site Administrator
| |
(ఉప్పలధడియం వెంకటేశ్వర)
నైలునదీ తీరాన
నాగరికత తొలిజాడ తెలుగు
'నిప్పూరు'లో మట్టిబిళ్ళపై
మెరిసిన తొలి అక్షరం తెలుగు
స్వీయముద్ర నిలుపుకొంటూ అమరవాణితో
చెలిమి చేసిన జాణతనం తెలుగు
ఖండఖండాంతరాల్లో అనేకానేక భాషల్లో
అల్లుకొన్న పరిమళం తెలుగు
అంధనేత్రం తెరిచి చూస్తే అగుపించే విశ్వరూపం
చరిత్రకందని ఏ యుగాల నుంచీ
నిరంతరంగా వెలుగుతోందో ఈ అఖండదీపం!
అత్యధిక సంఖ్యలో
నాణేలూ, శాసనాలూ కలిగిన దొడ్డ జాతి
వెయ్యేండ్ల నాడే స్త్రీ శక్తిని
సింహాసనమెక్కించిన ప్రోది
సర్వ మానవ సమానత్వం ప్రబోధించిన
వాగ్గేయకారుని వారసత్వం
కోటానుకోట్ల ప్రజల గుండెల్లో
తారకమంత్రమై నిలిచిన వేమన పద్యం
పిడికిలి బిగించిన పీడిత ప్రజల
మహా ప్రస్థాన జయగీతం
అంతటా తెలుగే, అన్నిటా తెలుగే!
ప్రభువుచే పల్లకీ మోయించుకొన్న కవులున్నారా ఎక్కడైనా?
కవి పాదాలకు గండపెండేరం తొడిగిన రాజు కనిపిస్తాడా
కాగడా పట్టుకొని వెదికినా?
మాటలను యధాతథంగా
అమితవేగంగా అనువదించే లిపి మరొకటుందా?
జానపదానికైనా, జటిల సమాసానికైనా
అనువుగా ఒదిగే తియ్యని భాష ఇంకొకటుందా?
ఏ మబ్బుతెరా ఆవరించని సూర్యతేజం
ఏ మంచుపొరా కమ్మజాలని మేరుశైలం
సానబట్టిన జాతి వజ్రం, పులుగడిగిన ఆణిముత్యం
ఔనౌను, జూలు విదిల్చిన సింహంరా తెలుగంటే!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|