|
|
Articles: TP Features | 'స్విస్' గుట్టు విప్పేనా? - Site Administrator
| |
చినికి చినికి గాలి వాన అయినట్టు స్విస్ బ్యాంకు ఖాతాల గుట్టు నిజంగానే రట్టు అయితే ఎంత బాగుండును! కొద్ది వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోట వినబడిన ఈ డిమాండ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, ఎన్.డి.ఎ కూటమి ప్రధాని పదవి అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ నోట వినరావడం ఎంత ఆనందంగా ఉంది! నిజంగానే ఈ కల నిజమవుతుందా? అన్ని లక్షల కోట్ల రూపాయల ధనం తిరిగి భారత్ చేతికి అంది మన అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలన్నీ నెరవేరుతాయా? లేక ఇది కూడా బిజెపి ఎన్నికల సమయంలో చేసే శుష్క వాగ్ధానాల జాబితాలో చేరిపోయి చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఎప్పటికీ ఫలించక కలకాలం నోరూరిస్తూనే ఉంటుందా?
అదేమైనప్పటికీ 15వ లోక్ సభ ఎన్నికల వేళ ఈ అంశాన్ని ప్రస్తావించి స్విస్ బ్యాంకులు సహా దేశాంతర సురక్షిత స్థావరాలలో దాగి ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్ల ధన రాశులన్నిటినీ వెతికి పట్టుకొని వెనుకకు రప్పిస్తామని, ఆ డబ్బుతో దేశంలో పేదలు, బాధితవర్గాల రుణాలను మాఫీ చేస్తామని, రోడ్లు నిర్మిస్తామని, పల్లెలకు విద్య వైద్య సౌకర్యాలు కల్పిస్తామని అద్వానీ వాగ్దానం చెయ్యడమే అత్యంత హర్షదాయకమైన విషయం. ఆయన దీనిని ఈ ఎన్నికలలో చర్చనీయాంశంగా చేపట్టినందుకు పార్టీలకతీతంగా అందరూ సంతోషించవలసి ఉన్నది. ఎన్.డి.ఎ అధికారంలో ఉన్నన్నాళ్ళూ, అద్వానీ హోంమంత్రిగా చేసినన్నాళ్ళూ ఆయనకు ఇటువంటి మహా సంకల్పం ఏల కలగలేదనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
బిజెపి గాని, కాంగ్రెస్ గాని మరే పక్షమైనా గాని అధికారంలో ఉన్నప్పుడు కుబేర వర్గాల సేవలో, వారి స్వప్రయోజనాలు నెరవేర్చే పనిలో తలమునకలు కావడం, ఎన్నికల సమయంలో ఓట్లున్న కోట్లాది నిరుపేద ప్రజల పట్ల మొసలి కన్నీరు కార్చడం పరిపాటి అయిపోయింది. అయినా ఆశ చావదు. ఒకనాటికైనా పాలకులు మెజారిటీ ఓటర్లయిన పేదలకిచ్చిన మాటను పాటించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆశించడంలో తప్పులేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|