|
|
Articles: Poetry | ప్రజాస్వామ్యం - Site Administrator
| |
(సప్రం గణేష్ బాబు)
మా నెత్తురుకి సిగ్గూ శరమూ రెండూ పోయాయి
ఎందుకంటే మాది ప్రజాస్వామ్యం
మేము డబ్బుకోసం కీర్తి కోసం అధికారం కోసం
ఏ విసర్జనైనా తాగి ఏ కసువైనా తినే
రాజకీయ నాయకుల్ని అందలమెక్కించే
ప్రజాస్వామ్య రాజకీయులం
దేశాన్ని ముక్కలు చేసినా
మనుషుల్ని మతాలుగా
కులాలుగా, ప్రాంతాలుగా విడగొట్టినా
మేము చీమూ రక్తం లేని శరీరాల్ని మోసుకుంటూ
తలొంచుకు తప్పుకు తిరుగుతామే తప్ప
మెదడులోకి మరో ఆలోచన రానీయని
సెక్యులరిజానికి మారు పేరులం
మేము తాగి పడిపోవడానికి మందుసీసాలిచ్చి
పొట్లాలు కట్టిన అన్నం మెతుకులు విసిరేసి
బళ్ళు కట్టి పశువుల్ని తోలుకుపోయినట్టు
భారీ బహిరంగ సభలకు తోలుకుపోయి
సొల్లు కబుర్లు చెబితే
సొంగ కార్చుకుంటూ ఓటేసే గొర్రెపోతులం
మేము ప్రజాస్వామ్య కార్యకర్తలం
మేము ప్రజాస్వామ్య వాదులం
ఎవడు ఏ విశృంఖలమైనా చేసి
ఏ చీకటి పనితోనైనా సరసాలాడేసి
చట్టాలకు న్యాయస్థానాలకు ఏ మత్తో తాగించేసి
దొరబాబుల్లా దొరతనంతో మాది ప్రజాస్వామ్యమని
కాలరెగరేయొచ్చు
అందుకే
ఇప్పుడు ప్రజాస్వామ్యమంటే
శ్మశానానికి కాటికాపరి లాంటిది
శవాల్ని జీవచ్ఛవాల్ని లెక్కలేసుకొని
కాలం వెనక గుంటలు తీసి పూడ్చుకోవడం తప్ప
రంగస్థలం మీద తనకి మరో పాత్రేదీ మిగిలి లేని
ప్రజాస్వామ్యమిది!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|