|
|
Articles: Poetry | శ్రీశ్రీ చిరంజీవి! - Site Administrator
| |
(వివి సుబ్బారావు)
శ్రీశ్రీ అంటే-
రెండు మందకొడి అక్షరాలు కాదు
రెండు మందుగుండు ఆశ్రితాలు
ఏ వైపు ముట్టించినా, రెట్టించినా
పెటిల్లున పేలే జనం చేతి ఆయుధాలు
అడవికే కాదు
అగ్నికి కూడా ఆలాపన నేర్పినవాడు శ్రీశ్రీ
నీటికీ, గాలికీ
నిప్పుల స్వరమందించినవాడు శ్రీశ్రీ
మాట్లు వేసే కళాయికారుడు కాదాయన
మంది పక్షం వహించి మాటుగాసి వేటువేసే
నిజమైన కళాకారుడు
మాటలు - మూటలు కట్టడానికి కాకుండా
బాధల మీట నొక్కి - పేటలు మేల్కొల్పినవాడు
చెమట చుక్కను
దారి మళ్ళించే దోపిడి మీద
తిరుగుబాటు చెర్నకోల తగిలించినవాడు
కర్రపెత్తనం మీద కుర్ర విప్లవతరం కొరడా విసిరినవాడు
రెండు దేశాల్ని
మైత్రీబంధంతో ముడివేయటానికి
ముసలితనం పొలిమేరలు పట్టించుకోకుండా
పల్లెలు, పట్నాలు
రాత్రీ, పగళ్ళై సుడిగాల్లా తిరిగినవాడు
పొద్దు వాలేప్పుడు కూడా..
పదబంధాలు దివిటీలు చేసుకొని
పాటల వల్లెవాటేసుకొని
చాలు చాలుకూ పాలుపోకుండా
కొత్త విత్తనాలు చల్లినవాడు శ్రీశ్రీ
పాత చెత్తకు నిప్పులంటించి
మంటల పంట తీసినవాడు శ్రీశ్రీ
ఖండిస్తే-
రెండు తలల వానపాములా
రక్తసిక్త కవిత్వ శిఖరాలుగా నడిచినవాడు
చివ్వకూ, మువ్వకూ
చెలిమి, బలిమినందించిన చెలికాడు
ఆకాశాన్ని లోకానికందించటానికి
అక్షరాక్షరమై జ్వలించినవాడు
అన్నార్తుల అర్ణవమై-
ఆకలికేక విన్పించినవాడు
దేశం మీద
రేపటి చలనచిత్రం గీసిన తొలి చిత్రకారుడు శ్రీశ్రీ!
పీడిత ప్రపంచ పర్వతాగ్రం మీద
తెలుగువాడి నిప్పుల తరంగ పతాకాన్నెగరేసిన సేనాపతి శ్రీశ్రీ!
నాటికీ, నేటికీ
రోగగ్రస్త సమాజ శరీరం పనిచేయటానికి
కలం - సిరంజిగా పట్టి పనిచేసిన చిరంజీవి శ్రీశ్రీ!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|