|
|
Articles: Poetry | ఎల్లలు చెరపండి - Site Administrator
| |
(డాక్టర్ కత్తి పద్మారావు)
మనిషిని కేంద్రంగా చేసుకొని
ఆలోచిస్తున్న వారంతా
పునర్వీక్షకులౌతున్నారు
మనిషిని ఒక చట్రం నుండి కొలవలేం కదా
నేను రకరకాల మనుషుల్ని చూస్తున్నాను
వారు చాలాసార్లు నిజం మాట్లాడాలని ప్రయత్నిస్తారు
అది వారికి సాధ్యం కాదు..
వారిచ్చే విందు భోజనాల్లో గుసగుసలుంటాయి
కోళ్ళు బతికొచ్చి పందేలాడతాయి
పొటేళ్ళు తలలు గుద్దుకొంటాయి
మనిషి సమూహం నుండి పుట్టి
సమూహాన్ని నిరాకరించాలని చూస్తున్నాడు
లోహాలను ఖనిజాలను
ఔషధాల్లో వాడతారని చాలామందికి తెలియదు
దానిని ద్రవంగానే చూస్తారు
ద్రవరూపంలో ఉన్నవన్నీ గడ్డకడుతూనే ఉన్నాయి
అనేకసార్లు మ్యాపులు, చిత్రాలు, గణాంకాలు పట్టికలు
మనకు గుర్తుండవు
ఏదో ఒక శిల్పంగానే మనకు విషయం అనుభూతమౌతుంది
మనిషి అన్వేషించే ప్రతి శాస్త్రీయాంశం
మనిషి కంటే గొప్పదిగా భావించబడుతుంది
కొన్నిసార్లు అది మనిషిని నిర్జిస్తుంది కూడా
మనిషి సమాధి కంటె ఎత్తుకు వెళ్ళాక
కిందికి చూస్తే అది అర్థం కాదు
మనిషికీ సమాజానికీ అనేక వైరుధ్యాలున్నాయి
మనం చూస్తున్న సుందర దృశ్యాల వెనుక
బీభత్సరసం ఉంది
తోటలు, సుందర భవనాలు,
వికసిస్తున్న పుష్పాలు, సౌగంధ్యాలు చూసి
మనం ముచ్చటపడుతున్నాం
కాని ఏదో ఒక పేరుతో మనిషిని ద్వేషించి
గాయపరుస్తున్న ఉదంతాల వెనకటి గాధల్ని
మనం గుర్తించటం లేదు
చల్లగా ఉన్న దేశాలన్నీ వెచ్చనవుతున్నాయి
వెచ్చగా ఉన్న దేశాలన్నిటా నేల నెర్రు విచ్చుతోంది
బుద్ధుని విగ్రహం కూలినప్పుడు హిమాలయం వణికింది
జాతి వైరం, కుల ద్వేషం, మానవ మనుగడకు కత్తివాదర
నదీనదాలు ప్రవహించిన దగ్గర
అలల్లోనే విద్య దాగుంది
జ్ఞానం సముద్రపు ఒడ్డున విలసిల్లింది
మీరు అగడ్తలు దూకుతున్నప్పుడల్లా
మీ అభద్రత జీవన వ్యవస్థల్ని భగ్నం చేస్తూనే ఉంది
ఎక్కడదాకా ఎందుకు?
ముందు మీ మధ్యాహ్నపు భోజనాల్లో ప్రేమను పంచగలరా?
సంస్కరణ పునాది నుండే ప్రారంభం కావాలి కదా
ఎగురుతున్న ప్రతి జెండాలో రంగులు కలిసే ఉన్నాయి
బుట్ట అల్లిక ఒక శాస్త్రం
కూజా నేమడం ఒక కళ
గుడ్డ నేయడం ఒక నేర్పు
మనిషిని జీవింపజేసే విద్యలన్నిటినీ మీరు కాలదన్నారు
మనుషులు సహజంగా జాతులుగా మారడంలో
హద్దులు ఏర్పడ్డాయి
ముందు జీవన విద్యా పరిమళానికి ఎల్లలు చెరపండి
అప్పుడు మానవత్వం ప్రదీప్తమవుతుంది
విద్య అంటే కేవలం వలస కాదు
మట్టినీ మనుగడనూ అర్థం చేసుకోవడమే అసలు విద్య
ఒక్కసారి మళ్ళీ అటువైపు చూడండి
అన్ని ద్వేషాలూ అంతరిస్తాయి.
(ఆస్ట్రేలియాలో జాతి వివక్ష దాడులకు వ్యతిరేకంగా...)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|