|
|
Articles: Poetry | వైవిధ్యాల ఆకళింపు - Site Administrator
| |
(డాక్టర్ సి. నారాయణరెడ్డి)
సుస్థిర చిత్తాన్ని ఏ చప్పుళ్ళూ కలతపెట్టలేవు
ఏ బాదుడు ఎలా కొనసాగుతూ ఉన్నా
పదునుదేరిన అనుభూతులు అక్షరాలై
కాగితం మైదానంలో కవాతు చేస్తుంటాయి.
సుడిగాలికి గోపురం ఊగిపోదు
దుడుకు గాడ్పుల దబాయింపులకు
ఎగిరిపోయేవి ఎండుటాకులే.
కెరటాలపైన కదలాడే పడవకు
ఒడ్డును ఢీకొనాలనే పెడబుద్ధి పడుతుంది
ఒడ్డు హుంకరించేసరికి
దానికి జడుపు పుట్టి తిరుగుముఖం పడుతుంది.
పూల పక్కనున్న ముళ్ళకు పొగరు తలకెక్కి
ఆ పూలన్నిటినీ పరిమళించడం మానుకొమ్మని శాసిస్తే
అవి ఊరుకుంటాయా?
పరిమళాలను ప్రసారం చేయడం
పూలకు జన్మహక్కు
తలలూపుతూ నిలిచే కొమ్మలు
ఏ అదృశ్య శక్తి ఆజ్ఞలతోనే
అని అనుకోరాదు.
అవి తలలూపేది
తమ కుదుళ్ళను పదిలంగా కాపాడుకున్న
నేల ఒడిని తలచుకోగా కలిగే తన్మయత్వం వల్ల
అనుకోని కారుమబ్బులూ
అకాలంగా ముసిరే మంచుపొగలూ
తూర్పుతల్లి సుఖ ప్రసవానికి ఆటంకాలే
ఆ గర్భ వేదనల నుంచి బయటపడినప్పుడే కదా
సూర్య శిశూదయం.
సృష్టి అన్నప్పుడు అనూహ్య వైరుధ్యాలు తప్పవు.
వాటి ఆంతర్యాలను ఆకళించుకున్నప్పుడే
కాలగతి క్రమశిక్షణతో సాగిపోతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|