|
|
Articles: Poetry | ఇదీ ఒక బతుకేనా? - Site Administrator
| |
(జూకంటి జగన్నాథం)
మబ్బుల
నడక మరిచిన నడక కోసం
విద్యానగర్ చౌరస్తాలో
గజగజలాడే చలి.
పదవ తరగతి పేపర్ పిల్లవాడు
కాళ్ళు చేతులకు ఏకకాలం పనితో
తెల్లారీ తెల్లారని బతుకును సదురుకుంటూ
చదువుల సారం గురించి ప్రశ్నిస్తూ
నా ముందు నుంచి
రివ్వున సైకిల్ పై మున్ముందుకు సాగుతాడు.
కొంచెం ముందుకు నడుస్తానో లేదో
'అల్లాహో అక్బర్' నమాజు
కార్తీకమాసం చల్లటి స్నానాల పుణ్యంపాటలు
రోడ్డు పక్క హొటల్లో చాయ్ తాగి
డబల్ రొట్టెల తట్టనెత్తుకొని
ఒక కులవృత్తి కోల్పోయిన నడివయస్కుడు
నన్ను వెక్కిరిస్తూ
పల్లెల వైపు కదిలిపోతుంటాడు.
ఇంకా ముందుకు పోతానో లేదో
నడుమ ఆసరాకు తువ్వాల కట్టుకు
తన పాచి ఇల్లును అలాగే ఉంచి
రోడ్డును ఊడుస్తున్న తల్లులు
నాలుగు రోడ్ల నడిమిల నిలబడి
గాంధీ తాత వెటకారం బోసినవ్వు
నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది.
అడుగుల వేగం లయబద్ధ రాగం
అందుకుంటుందో లేదో
మసీదు తొవ్వకు రామాలయం వీధికి మధ్య
'తాత కొడుకా కులం లేదంటివి
బిడ్డా మతం హితం కాదంటివి
ప్రాంతాలకతీతంగా మెలగాలంటివి
ఇప్పుడు చెప్పంటూ'
నాల్గు తొవ్వల అంబేద్కర్ నిలబడి
వేలెత్తి చూపుతూ
నన్ను నిలువునా తలవాల్చుకునేలా చేస్తుండు.
ఉరుకులాడుతున్న కాల్లల్ల కట్టిపెట్టినట్లు
బస్టాండు పేపర్ల దుకాణాన్ని చూడగానే
నడక ఆగిపోతుంది
పత్రిక విప్పుతానా నోట్లె మాట రాదు
వీని మీద వాడు వాని మీద వీడు
నవ్వు తక్కువనా అంటే నువ్వేం తక్కువనా
రక్తం రంగురంగులను పులుముకు
ప్రజాస్వామ్యం ధనస్వామ్యం
కొమ్ము కాస్తూనే ఉంటుంది
కొనాకరికి చావును సుత ఓట్లుగా మలుచుకుంటూ
కుర్చీ కోసం కర్చీఫ్ రాజకీయ ఆట ఏమి జరిగినా
మెరమెచ్చులకు కదిలినట్టు కదులుతాను
మందికి చూడ మెదిలినట్టు మెదులుతాను
నైలునది మైలురాయి ముఖం కాని నా ముఖం మీద
యాక్ 'థూ' నీదీ ఒక బ్రతుకేనా!
ఒంటికాలెత్తి కుక్క ఒకటి ఉచ్చ పోస్తూ పోతుంది
అన్ని మిడుకుతున్న నడకలను చాలించి
తడారిపోయి వాడిపోయి
ఇంటి సమాధిలోకి నిష్క్రమిస్తాను.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|