|
|
Articles: Short Stories | సరళ - Site Administrator
| |
(ఐత చంద్రయ్య)
బొందిలో ప్రాణాలున్నంత వరకు బొందలు తోడుతూ బతికిన బొందయ్యగ్గూడా బొంద కావాలనే నిజం ఆ ఊరి జనాల్లో కలవరం సృష్టించింది.
'మట్టి నుంచి పుట్టిన మనిషి పాడం బోయినంక ఆ కట్టెను మట్టిల వెట్టక నెత్తిలవెట్టుకుంటారా?' అరుగు మీద గోడకొరిగి కూచున్న అరవయ్యేళ్ళ పెద్దమనిషి సవాలు.
'గిదేమన్నా ఎనకటి కాలమా? బొందవెట్టుడెందుకూ? కాష్టం జెయ్యచ్చుగదా!' ఓ యువకుని సలహా.
'అరేయ్ పిల్లగా!' పెద్దమనిషి మీసాల కింద నవ్వులాంటిది మెరిసింది. 'కాష్టం జెయ్యాలంటే చాలా కష్టాలు ఉన్నాయి.' మనిషి పీనుగంటే సామాన్యమా! అన్ని కట్టెలు కొనాలంటే చాలా రూపాయలు కావెలగదరా! చుట్ట అంటించుకుంటూ చురక వేసిండు. కాలు మీద కాలేసుకుని పూర్తిగా ఒరిగి కూర్చున్నాడు.
పక్కనే నుంచున్న మల్లమ్మ ముక్కు చీది కొంగుతో తుడుచుకుంటూ మనూర్లో ఎవరు సచ్చినా బొందల వెడ్తుండ్రు గదా. మనూరి ఆచారమే అది. కొత్త షిరస్తా దెచ్చి కొంపముంచుతరా ఏంది? మండిపడుతూ ముక్కు మీద వేలేసుకుంది.
'నీ యవ్వ గీ ఆచారాలే మనకు గ్రహచారాలు.' పెయ్యంతా కారప్పొడి చల్లినట్టయిందా యువకునికి. 'మన చుట్టు పక్క ఊర్లల్ల, పట్నాలల్ల గిట్లనే ఉన్నదా?' నిలదీశాడు.
'లేక పోవచ్చు. మరో వృద్ధునికి రోషం పొడుచుకొచ్చింది. మనూరి షిరాస్తా మనూరిది. పాపం! ఊర్ల ఎవరు సచ్చినా బొందయ్యనే బొంద దోడె. గిప్పుడు బొందయ్యనే సచ్చిపాయె' అరుగు మీద మలుచుకున్న కాళ్లను కిందకు వేళ్ళాడేసిండు.
'బొందయ్య సచ్చిపాయె. ఇంగ బొంద ఎవ్వలు తోడ్తరటా!'మరో యువకుని ప్రశ్నాబాణం.
పెద్దమనిషి పక్కన కూచున్న మరో వృద్ధుడు రుమాలు సవరించుకుని ఆరె నీ యవ్వ గీ వైసు పోరలకేమైంది? ఆశ్చర్యం ప్రకటించి బనీను జేబులోంచి చుట్ట, అగ్గిపెట్టే దీసిండు.
'వైసు పోరల సంగతి చెప్తున్నావు గాని ముందు నీ మీసాల సంగతి చూస్కో తాతా! చుట్ట బదులు మీసాలు కాల్చుకుంటవేమో'! మొదటి యువకుని మొహమ్మీద ముసిముసి నవ్వు.
జోకు పేలలేదు. మొహం మసిబట్టలాగైపోయింది. రెండో యువకుడు గుర్రుమన్నడు. శవం ముంగిట జోకులేస్తవా! అని నిలదీస్తున్నాయతని చూపులు.
'చూడు బిడ్డా'! పెద్ద మనిషి సర్దుక్కూచున్నడు. కళ్లమీదికొస్తున్న సూర్యకిరణాలను అరచేత్తో అడ్డుకుంటున్నడు. 'మహారాజులు చస్తే గంధంచెక్కలతోని కాష్టం జేస్తరు. మనసోంటోళ్ళ కాష్టాన్ని మామూలు కట్టెల్తోని కాలవెడ్తరు. మామూలు కాష్టాలగ్గూడా వందల రూపాయలు కావాలె.'
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|