|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
(కె.వి.నరేందర్)
మూడ్రోజుల్నించీ గుడ్డి ముసురు...
బురద బురదైపోయిన మట్టిరోడ్డు... అడుగు ఆసరా తప్పితే జర్రున జారినట్టే అయితంది. అంత ఇసుకుడిసుకుడు... రొచ్చు రొచ్చు...
అప్పుడే తెల్లార్తంది...
నెత్తిన పాలగంప పెట్టుకుని దవాదవా నడుత్తంది లస్మవ్వ. అరిగిపోయిన సిప్పర్లతోని కొంకులదాక బురద చిల్తంది... రోజటి నడుకే...
ఒకటా రెండా... ఇరవై మూడేండ్ల నుంచి గిదే నడుక...
'పొద్దుగాల వరకు పాలు వొయ్యకవొతే గులుక్కుంటారు. ముసురు పడవట్టె... ఉడుకుడుకు చాయె తాగటానికి పాల కోసం ఎదురుసూత్తరు'... అనుకుంట నడుత్తంది.
మోతె ఊరు నుంచి జయితాల రెండు కిలోమీటర్లు.
గంపల పాలచెంబులు తొల్కకుండ మెత్తగ వరిగడ్డి పరిచి ఎనిమిది చెంబులు పెట్టింది.
పన్నెండిండ్లల్ల వాడుకమాయె...
చిక్కటి పాలు... రెండు చెంబులే నీల్లు కలుపుతది.
'లస్మవ్వ పాలతోని చాయెనే కాదు... పెరుగు కూడా గడ్డలెక్కుండి రుచుంటది' అంటరు వాడుకపోల్లు.
పాల పాకెట్ల కన్న ముందుగాల్నే తలుపు తడుతది లస్మవ్వ... కొన్నిండ్లల్ల ఆడోల్లు నిద్రమబ్బులకెల్లి తలుపు తీసి గిన్నె పడుతరు.
'తెల్లారంగ ముండబొడ్డి మొకం కనవడ్డదని' ఎక్కడనుకుంటరోనని మొకం తిప్పుకుంటది లస్మవ్వ. అప్పుడప్పుడు కొందరికి ఆనిగెపు కాయలు, బబ్బెర్లు, బోడగాకరకాయలు, మొర్రి పండ్లు, పుల్చింతకాయలు, జున్నుపాలు తెచ్చిపెడ్తది.
తొమ్మిది ఇండ్లల్ల... మూడు హోటల్లల్ల పాలు పోస్తది.
తిరుపతి హోటల్ల చుడువ అటుకులు బుక్కి ఎనిమిదింటికల్లా ఎనుకకు మర్లుతది...
ముసురెక్కువైంది...
కాళ్లు గుంజుతున్నయ్... మోకాల్ల నొప్పులేత్తన్నయ్... బొక్కలు సున్నమోలె శిదలు శిదలైనట్టు జలుపుతున్నయ్. బుచ్చన్న డాక్టర్ దగ్గర రెండు సూదులేయించుకున్నా తగ్గుతల్లేవు... జెల్దెన పోవాలె.... బర్రెకు దయ్యం పట్టిందో, దేవుని కొంటెతనమోగని... రాత్రిపూట తన్నింది... తెల్లారంగ పాలిచ్చుటానికి సతాయించింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|