|
|
Articles: Devotion | నాగారాధన - Site Administrator
| |
కార్తీకమాసంలో వచ్చే శుద్ధ చవితిన ఈ పండుగ మనం చేసుకుంటాం. అలాగే, మరునాడు వచ్చే పంచమిని నాగపంచమిగా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. సమస్తమైన భూభారాన్నీ మోసేది ఆదిశేషువేనంటారు. అదీగాక సకల సృష్టిని పోషించే భారాన్ని వహించిన శ్రీ మహా విష్ణువునకు పవళించేందుకు మెత్తనిశయ్యగా ఉండేదీ ఆదిశేషువే. మహా దేవుడైన పరమేశ్వరునికి ఆభరణంగా అమరిందీ సర్పజాతే. ఇలా తన సేవలను పరమాత్మకు అంకితం చేసిన సర్ప జాతిని దేవుడిగా పూజించడంలోనూ, ఆరాధించడంలోనూ మన విధికూడా. ఇలాంటి పండుగలను సృష్టించి మన కర్తవ్యాన్ని గుర్తుచేశారు మన పూర్వీకులు, మన తరతరాల సంప్రదాయాలు.
శివకేశవులిద్దరికీ అత్యంత ప్రియమాసమైన కార్తీకంలో వస్తుందీ నాగులచవితి. ఈ రోజు మహిళామణులందరూ తమ సమీపంలో ఉన్న పుట్టలో పాలుపోసి చిమ్మిలి (నువ్వులు, బెల్లం మిశ్రమం) ఉండలు, చలిమిడి, పానకం, వడపప్పు నైవేద్యం పెడతారు. అయితే, పుట్టవద్ద దీపాలు మాత్రం వెలిగించరు. మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేసి రెండోపూట పాలుపళ్లూ మాత్రమే తీసుకుంటారు. సంతానలేమితో బాధపడేవారు తప్పక నాగుల చవితినాడు నాగారాధన చేస్తారు. ఈరోజు పుట్టలో పాలు పోస్తూ 'తోకతొక్కితే తొలగిపో! నడుం తొక్కితే నావాడనుకో' అని ప్రార్థిస్తారు. ఇంకా 'నూకలు పోస్తాం, మూకలనివ్వు' మంటూ అర్థిస్తారు. ఇక్కడ మూకలంటే సంతానమనే అర్థం.
నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో 'ఓం నాగేంద్రస్వామినే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. ఆరోగ్యం, సిరిసంపదలు ఇచ్చే భగవంతుడిగా సుబ్రహ్మణ్యస్వామికి పేరుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి రూపమే నాగులు అని ప్రతీతి. ఈ రోజున మహిళలు ఎంతో పవిత్రంగా భావించి, నిష్టతో నాగార్చనలు చేస్తారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|