|
|
Articles: Poetry | ఏ దుర్ఘటనలైనా - Site Administrator
| |
(డాక్టర్ సి.నారాయణరెడ్డి)
చల్లని వానజల్లులతో
బీళ్ళకు పులకలెత్తించే గగనతలం
ఎప్పుడు చిచ్చర పిడుగులను కురిపిస్తుందో తెలియదు.
తాను నిర్విరామంగా చలిస్తున్నా
తనపైన వున్న చరాచర సృష్టిని
నిశ్చలంగా లాలించే ధరాగోళం
ఎప్పుడు అకాల ప్రకంపనలను సృష్టిస్తుందో తెలియదు.
తాను సమగతిలో ప్రసరిస్తూ
తనను ఆశ్రయించిన ప్రాణికోటికి నిరంతరం
నిత్య రక్షగా నిలిచే వాయుమండలం
ఎప్పుడు విషమశక్తిగా వికటిస్తుందో తెలియదు.
ప్రకృతిలోని పరిణామ విపరిణామాల
పరస్పర సంఘర్షణల పర్యవసానమే
అనూహ్య కల్లోలాల ఆవిర్భావం.
ఏ దుర్ఘటనలైనా మన తలుపు తట్టి
ఇదిగో మేమొస్తున్నామని చెప్పవు.
ఆకస్మికంగా తారసిల్లే
ఆ దుర్ఘటనలు ఎన్ని రకాలని.
దృశ్యంగా వుంటూనే అదృశ్యంగా ఉండేవి.
ఖంగున మోగుతూనే నిశ్శబ్దంగా నిష్క్రమించేవి.
ఊహల్లో అల్లుకుపోతూనే
అప్పటికప్పుడే మనసులో శూన్యాన్ని నింపేవి.
దుర్ఘటనలు సంభవించాయని
దుఃఖ ప్రకటనలు చేస్తూ కర్తవ్య విముఖులు కావడం
మానవ ధర్మం కాదు.
పైన పొర్లి పడుతున్న కెరటం మీద
ఎగిరి దూకితే తప్ప తీరం చేరుకోలేము.
నైరాశ్యం లోంచి ఆశను చేదుకున్నప్పుడే
ఏ మనిషైనా కడవూపిరి దాకా
విజయపథంలో వెనుతిరగక సాగిపోతాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|