|
|
Articles: Poetry | ఆవిష్కరణ - Site Administrator
| |
(డా.కత్తిపద్మారావు)
అనేక ప్రకృతిశక్తులు
మనస్సును ఉత్తేజపరుస్తున్నాయి
చిన్న మల్లెనవ్వులో ఉన్న సౌందర్యం
ఉప్పొంగే సముద్రపు అలల్లో కూడా లేదు
ఎంత పెద్ద ప్రవాహాన్నయినా
ఒక చెలియలికట్ట అడ్డుకొంటూనే ఉంది
ఉద్విగ్నత నుండి
బయటపడేసే శక్తి
ఒక్క భావావేశానిదే
తల్లి బొటనవేలితో వెన్ననాకిస్తున్నపుడు
కలిగే అనుభూతిని
తెరతెరలుగా వచ్చే ఒక నవ్వు ఇవ్వగలదు కదా!
అవును కొందరు అంతరంగాన్ని
దరహాసంలో రంగరిస్తారు
అభివ్యక్తి కాని ఎన్నో కావ్యాలు అందులో ఉంటాయి
సూర్యునికి మొగ్గకి
తెరలా ఒక మంచుబిందు సందోహం
అవును! మనుష్యులు ఏమి చెబుతున్నారు
ఏమి దాస్తున్నారు
వెన్నెలకు బదులు
చీకటిని ఎందుకు అందిస్తున్నారు?
ఘర్షణతో ఎందుకు
మెదడును మెలిబెడుతున్నారు?
ఒక్క కరచాలనానికి
ఇన్ని అవాంతరాలా!
ఆంతర్యం ముసుగు దొంగలా ఉన్నప్పుడు
భాషలో భావం శూన్యం కదా!
అభివ్యక్తిలోని భీతి
వ్యాధులకు మూలమేమో!
ఆ మొక్కజొన్న చేను తెగుళ్ళను ఎదుర్కొంది
అవును! ఎవరు నవ్వించారో వారిని గుర్తించింది
అందులోని వెలుగుతో స్నానమాడింది
నిజమే. నవ్వులోని వెలుగులన్నీ
అంతరంగ సవ్వడిలోవే
వాటి ఆవిష్కరణకు ఒక స్వాగతం
నిజమే. వెలుగు చీకటుల
ఘర్షణ నుండే కదా ఆవిష్కరణ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|