|
|
Articles: Short Stories | గ్రహణం - Site Administrator
| |
(చిలుకూరి దేవపుత్ర)
`పురపాలక అప్పర్ ప్రైమరీ పాఠశాల' అన్న బోర్డు చూసి, దానికి అవతల ఉన్న పిల్లల గలాటా... ఆ గలాటాలోనే భాగంగా `పన్నెండు రెండ్ల ఇరవై నాలుగు'... అంటూ గొంతులు చించుకుని ఎక్కాల్ని పలుకుతున్న పిల్లలను చూస్తూ ఆ బడి ఆవరణలోకి అడుగుపెట్టాడు చందు, చేతిలో రికార్డు షీట్లతో. అతని పిల్లలిద్దరూ రమ్య, రాజు బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ బెదురుచూపులు చూస్తూ నడుస్తూ ఉన్నారు. రమ్యని 5వ తరగతిలోనూ, రాజూని 3వ తరగతిలోనూ చేర్పించాలని అక్కడికొచ్చాడు చందు.
ఒక క్లాసు గదిలోంచి ఒక పిల్లోడు నిక్కర్ని ఎగేసుకుంటూ ఓంటేలుకనేమో కాంపౌండ్ బయటకి పోతూ కనిపించాడు.
ఇద్దో బాబూ! అంటూ వాడిని నిలిపాడు చందు.
ఏమిటన్నట్టు చూశాడు ఆ పిల్లోడు.
మీ హెడ్మాస్టర్ ఎక్కడుంటారు? అనడిగాడు.
అక్కడ అంటూ తూర్పు వైపున ఉన్న గదివైపు వేలు చూపించి, రమ్య, రాజుల్ని ఒక్కసారిగా ఎగాదిగా చూసి, గిరుక్కున తిరిగి తను వెళ్ళాల్సిన పని గుర్తొచ్చి పరుగెత్తుకెళ్ళిపోయాడు.
హైడ్మాస్టరు గదికి చేరుకున్నాడు చందు. హెడ్మాస్టరొక్కడే ఏదో రిజిస్టరు రాస్తూ ఉన్నాడు.... రాసింది సరిగ్గా ఉన్నట్టు తల ఊపుతున్నాడు.
నమస్తే సార్! అన్నాడు వాకిట్లో నుంచే చందు.
తలెత్తి చూశాడు హెడ్మాస్టర్.
ఎస్ కమిన్ అన్నాడు.
ప్రతి నమస్కారం చేయకపోగా లేటుగా వచ్చిన పిల్లల్ని క్లాసులోకి రమ్మన్నట్టుగానే ఉంది ఆయన తీరు.
లోపలికి వెళ్ళి హెడ్మాస్టరు ముందున్న కుర్చీలో కూర్చుని, తను అక్కడికి ఎందుకు వచ్చిందీ తెలిపాడు చందు.
హెడ్మాస్టర్ వయసు నలభై ఏళ్ళు ఉంటాయి. నల్లగా ఉన్నాడు. కొంచెం బట్టతల, వెంట్రుకలున్న భాగాన్ని మామూలుగా దువ్వినట్టు అనిపించదు, అల్లరి చేసే పిల్లల్ని బెత్తంతో బెదిరించి, అదుపులో ఉంచినంతగా అనిపిస్తుంది. అక్కినేని కాలం నాటి మీసకట్టూ, నున్నగా షేవ్ చేసిన గడ్డం, కళ్ళకున్న రోల్డుగోల్డు ఫ్రేం అద్దాలూ... అన్నీ కలిసిన గంభీరమైన మొహం అతనిది అనుకున్నాడు చందు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|