|
|
Articles: My Thoughts | తప్పెవరిది?! - Site Administrator
| |
యౌవన దశలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతగా పట్టించుకున్నా వాళ్ళలో కొత్తగా వస్తున్న మార్పులకి, ఉద్రేక ఉద్వేగాలకు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నేటి సినిమాలు తోడవుతున్నాయి. 'బోయ్ ఫ్రెండ్' ఉండటం పెద్ద 'ప్రిస్టేజి'గ తయారయింది. ఈ మధ్య సినిమాల్లో చాలా వింతగా అబ్బాయిలు అబ్బాయిల్ని 'ఏమే', 'రావే', 'ఏమిటే' అంటే అమ్మాయిలకి కోపం రాకపోగా అట్లా పిలిచే సంస్కారం ఉన్నవాడిని అభిమానించడం... ముందు తిరస్కరించడం - ఆ తర్వాత ప్రేమించడం ఇలాంటి కథలు చూచి చూచి పిల్లలు ప్రేమంటే ఇంతే! వెంటపడితే ప్రేమిస్తారు... లేకుంటే బెదిరించవచ్చు, యాసిడ్ పోయవచ్చు... కత్తితో నరకనూ వచ్చు అని, అబ్బాయి ప్రేమించమంటే అమ్మాయి ప్రేమించవలసిందే అనే నిర్ధారణకు వస్తున్నారు.
మంచిపుస్తకాలను చదవాలని గాని, పెద్దవాళ్ళు చెబితే ఏదైనా వినాలని గాని అనుకొనే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు... ఆడంబరాలు, అతిశయాలు నేర్పుతూ పెంచినంతకాలం పిల్లల్లో గర్వాన్ని, దర్పాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తున్నామనే అర్థం. డబ్బుని కష్టపడకుండా సంపాదించడం ఎలా అనేది నేటి యువతలో చాలా మంది ధ్యేయం అయింది. అందుకే రకరకాల నేరాలు... ఎన్నో వ్యసనాలు. అవి కొనసాగించేందుకు, ఆర్థికావసరాలు తీర్చుకునేందుకు తప్పుడు పనులు... తప్పుటడగులు.
వెనుకటి రోజులలో వలే ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడం లేదు. బాగా చదువుకొంటున్నారు. మగపిల్లల్తో పోటీపడుతున్నారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో తమ ఉనికిని నిరూపించుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఒక్కోసారి ఊహకందని విజయాలను, అరుదైన విజయాలను కూడా సైతం కైవశం చేసుకొంటున్నారు. చదువు రీత్యా, ఉద్యోగరీత్యా ఇంటికి, అయినవారికి, తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండవలసిన పరిస్థితులు వస్తున్నాయి... అదుగో అలాంటప్పుడే ధైర్యంగ, స్థైర్యంగ, మనో నిబ్బరంతో సమస్యలను, క్లిష్ట పరిస్తితులను ఎదుర్కొనే నేర్పు, బుద్ధిబలం కావాలి. అటువంటి శిక్షణ ఇంటినుండి, బడినుండి, సమాజం నుండి రావాలి. చిన్నచిన్న కారణాలకే బెంబేలుపడిపోయి చేతగానితనంగా ఆత్మహత్యలు చేసుకోవడం - లేదా ధైర్యం కోల్పోయి బేలతనంతో వ్యవహరించడం సరికాదు. మన విద్యాలయాల్లో సైతం చదువుకొమ్మని తప్ప జీవితాన్ని జీవించటానికే అని ధైర్యం నూరిపోసే పాఠశాలలు ఎక్కడా లేవు. శిక్షణ లేదు. అసలు చెప్పేవారు కరవయినారు...
ముఖ్యంగ ఆడపిల్లల బళ్లల్లో, కళాశాలల్లో నిపుణులైన మానసిక వైద్యుల చేత, సామాజిక కార్యకర్తల చేత నెలకోసారైనా ధైర్యాన్ని, స్వాభిమానాన్ని పెంపొందించే తరగతలు నిర్వహింపచేయాలి... 'అంతా మన ఖర్మ. ఆడదై పుట్టడం మనం చేసుకున్న పాపం' అనే తరహా మాటలు, పిరికితనం వంటపట్టిందంటే రోజూ మనం పత్రికల్లో చూసే వార్తలు, ఆత్మహత్యలు... తల్లి పిల్లల్తో సహా ఆత్మహత్యలు లాంటివి ఇంకా ఇంకా చూడవలసి వస్తుంది. చదువులో, జీవితంలో కూడా ఒక్కోసారి తోటివారింకటే వెనుకబడి ఉండవచ్చు. అంతమాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదని తెలిసేలా బోధించాలి. ఆధునికతని వేషభాషల్లోనే కాక... ఆలోచనా విధానంలో పెంపొందింపచేయాలి. అట్లా పిల్లల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. లేకుంటే జరుగుతున్న పరిణామాలకు తప్పెవరది అని ప్రశ్నించుకోవలసి వస్తుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|