|
|
Articles: Literature | విధి వంచిత ద్రౌపది - Mr. SATYANARAYANA PISKA
| |
భీముణ్ణి నివ్వెరపుచ్చి, అమాయకుణ్ణి చేసి, సంతోషపెట్టి లొంగదీసుకుంది. అతని వంక తను కాంక్షగా చూస్తుంటే తన చూపులు పసికట్టిన జనం ఎలా గుసగుసలాడుకుంటారో చెప్పి భీముణ్ణి పులకరింపజేసింది. సుధేష్ణకు పనులు చేసి చేసి కాయలు కాసిపోయిన తన చేతులను భీముని చేతుల్లో పెట్టి, రొమ్ముమీద వాలిపోయింది. భోరున తానేడ్చి, అంతగానూ అతడినీ ఏడ్పించింది. చివరికి -
'వాని దెగజూడ వైతేని, వాయుపుత్ర!
నీవు కనుగొన నురినైన, నీరనైన
నగ్నినైన, విషంబుననైన, నేను
మేను దొరగుదునెట్లు నీ యాన సుమ్ము!'
అని బెదరగొట్టి, అతణ్ణి పూర్తిగా బానిసను చేసుకుంది.
'ఎల్లి ఎల్లవిధంబుల నెందుఁ జొచ్చె
నేని, యా ధర్మతనయుండు తానె వచ్చి
యడ్డుపడెనేని, నీవ పెంపారు కరుణ
కాచితేని నాచేఁ బడు కీచకుండు'
అని ప్రతిన చేయించి, మరునాటి రాత్రి అతడి చేతనే కీచకుణ్ణి దారుణంగా చంపించింది. పట్టిన పగ చల్లార్చుకుంది.
పగలు-- విరాటుని కొలువులో తాను చేయని నటనకు నలుగురిలో అవమానం పాలయింది. మనస్సు గాయపడింది.
రాత్రి-- భీముని ఎదుట తాను చేసిన నటనకు కొలువులో దొరకని ఊరట దొరికింది. పగ చల్లారింది.
ద్రౌపది జీవితంలోని విషాదమంతా ఈ వైపరీత్యంలో ఉంది.
*** *** *** ***
శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళే ముందు పాండవులందరూ సంధి కావాలనే కోరారు, ఒక్క సహదేవుడు తప్ప! సంధి జరిపించడానికే కృష్ణుడు హస్తినకు బయలుదేరాడు.
ద్రౌపదికి జరిగిన అవమానం గానీ, కురుసభలో భీముడు చేసిన శపథం గానీ ఎవరికీ గుర్తున్నట్లు లేదు. గుర్తున్నా, పట్టించుకున్నట్లు లేదు.
ద్రౌపది గుండె బద్దలు కావడానికి సిద్ధంగా ఉంది.
కృష్ణుడు దాన్ని కదపనే కదిపాడు. అప్పుడు ద్రౌపది --
'నీవు సుభద్రకంటె కడు నెయ్యము, గారవముం దలిర్ప సం
భావన సేయు, దిట్టి నను బంకజనాభ! యొకండు రాజసూ
యావబృథంబునందు శుచియై పెనుపొందిన వేణి బట్టి యీ
యేవురు చూడగా సభకు నీడ్చె! కులాంగన నిట్లొనర్తురే!'
అని కృష్ణుణ్ణే ప్రశ్నించింది.
ఆ ప్రశ్నలో - నీ చెల్లెలు సుభద్రకే ఇంతటి అవమానం జరిగితే నీవు సహించి ఊరుకోగలవా - అనే ధ్వని ఉండటం గమనించి అంతటి అవతారపురుషుడూ నివ్వెరపోయాడు.
ద్రౌపది తటాలున లేచి, కేశపాశం విప్పి, కాలనాగులా జారిపడిన వెంట్రుకలను ఎడమచేత ఎత్తిపట్టి
'ఇవి దుస్ససేను వ్రేళ్ళం
దవిలి సగము త్రెవ్విపోయి తక్కినయవి! కౌ
రవుల కడఁ దీరుమాటల
యవసరమునఁ దలపవలయు నచ్యుత! వీనిన్'
అని ఆవేశంగా హెచ్చరించింది.
కౌరవసభలో, సంధి ప్రసంగం చేసేవేళ, దుశ్శాసనుడు పట్టి ఈడ్వగా సగం తెగి మిగిలిపోయిన ఆ వెంట్రుకలు కళ్ళ ఎదుట కదులుతూ కనబడుతుంటే, కృష్ణుడికి మాత్రం సంధి కుదర్చటం సాధ్యమా!...
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|