|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
పొలాలలోనికెళ్ళి చుట్టూ కలయజూసాడు ముసిలోడు. ఆకుపచ్చని ఆహారం - మధ్య జీర్ణకోశంలా వంపు తిరిగి - అటూఇటూ పాగా దులిపి - గర్వంగా నిలబడ్డాడు. వరిచేలు ఆరం (ఆహారం) పడుతున్నాయి. ఆకుపచ్చ వరివెన్ను గింజల్ని చిదిపి జూస్తే పాలుగారాయి. తన పొలంలో అక్కడక్కడా కనబడుతున్న పసుపు వరిరేకుల్ని చూసి 'చీడ' అనుకున్నాడు. వరిపీకల్ని (లేతవెన్నుల్ని) ముద్దెట్టుకున్నాడు. మోజేతుల్ని ఒకటి రెండు గరుకు వరిరేకులు తెల్లని గీతలు గీశాయి. చిపచిప నీళ్ళలోని కప్పని - మంటిబుక్కడం (విషంలేని పాము) వెంటాడుతోంటే... దాని తోకపట్టుకుని, పైకెత్తి, గిరగిరా తిప్పి గిరాటేశాడు. కప్ప తన కాళ్ళొట్టుకుంది. ప్రేమగా దాన్ని పట్టి మళ్ళీ 'మడి' లో పడేశాడు. జల్లకొయ్య (ముళ్ళచేప) పాదాల్ని గిచ్చి పారిపోయింది... సలుపు సలుపు. బొమ్మిడాయి (రెండువేపుల తల వున్న చేప) బురదలోంచి బుర్రెత్తి (తెలత్తి) బుడుంగున మళ్ళీ బురదలోకి దూరిపోయింది. బొమ్మిడాల పులుసు భళేగుంటది... నాలుక తిగిడాడు ముసిలోడు.
తలెత్తి తూరుపును జూస్తే తెల్లని గాజుద్రవంలా ఉన్న సూరీడు 'నన్ను జూడకు... కళ్లు పోగలవు' అంటున్నాడు. వెలుతురులోని 'అందం' అంత వెచ్చగావుండి... పెరిగినకొద్దీ అంత ప్రమాదమైన 'మంట' వద్దన్నమాట! బురద కాళ్ళతో పొలంగట్టున నడుస్తున్న ఆ 'మడిసి' ఆ యుగానికి మహానుభావుడిలాగున్నాడు. 'బలి' చేసింతర్వాత, ఊడిక పొలినెత్తురు కొమ్మలు ఎక్కడెక్కడ పాతిపెట్టాలో - ఆన (గుర్తు) పెట్టుకున్నాడు మనసులో. గావంచా కడచెంగును బొడ్డున దోపుకొని - గబగబా ఇంటికొచ్చాడు. దసరా పొద్దు రెండుబారల ఎత్తుకొచ్చింది.
'ఒసే... సూరమ్మ కోడలా... నాలుగు రేకలు నీరు (తాడిరేకులతో కట్టిన చేద - నీళ్ళు తోడుకొనేది) తోడిమీ, పోసుకుంటాను' కేకేసాడు ముసిలోడు.
'ఓలమ్మో! నూతిలోన నీరంతా తోడించీసి సంపుతాడు' అనుకొని మగ్గుంటలు దూరంగా పారిపోయారు. ముసిల్దే వచ్చి '... అస్స... హన్న... పనుల్తోటి జబ్బలు పులిసిపోనాయి. ఆం.. రామీ... నాలురేకల్తో నీరు సరిపెట్టుకో - ఈ యేల... తోడించి సంపీకు' ముసిల్ది.
'పోనీ... ఇంటినిండా మడుసులే. ఆల్నెవర్నో తోలిగూడదేటి' మగ్గుంటలు జడిసి పారిపోనారు. సుట్టంసూపు కొచ్చినోళ్ళకు పనులొప్పజూస్తావేటి?... రా.రా.. నాలుగు రేకల నీళ్ళు పోసుకొని దసరాపన్లు జూడకూడదేటి... సచ్చిందాకా చాపలమోతే నీతోటి... నాకు... చావనివ్వవూ బతకనివ్వవూ' ముసిల్ది నీళ్ళు తోడుతూ గొణిగింది..
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|