|
|
Articles: Literature | vidhivanchita droupadi - Mr. SATYANARAYANA PISKA
| |
దసరా పండగకు శమీపూజ చేయడం మన సంప్రదాయం. శమీవృక్షం పేరు వినగానే ఠక్కున మనకు మహాభారతంలోని విరాటపర్వ గాథ గుర్తుకు వస్తుంది. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేయ నిశ్చయించుకున్న పాండవులు, తమ ఆయుధాలను శమీవృక్షంపై ఉంచి బయలుదేరుతారు. ఆ మహాభారత కథానాయికే ద్రౌపదీదేవి. ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు అన్నింటిలోనూ ద్రౌపది వంటి విలక్షణ నాయిక మనకు మరెక్కడా కనిపించదు. భారతీయ సాహిత్యంలోనే కాదు, బహుశా ప్రపంచ సాహిత్యంలో కూడా అటువంటి పాత్ర ఇంకెక్కడా గోచరించదంటే అతిశయోక్తి కాదేమో!... మరి, అంతటి విలక్షణ స్త్రీమూర్తి ద్రౌపది ఆంతర్యంలో ఎన్నెన్ని విరుద్ధభావాలు సుడులు తిరిగి ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా!
జీవితం నటన కాదు. నటనలో జీవించేవారికీ, జీవితంలో నటించేవారికీ కూడా నటనకు సంబంధించని వేరే జీవితం ఉంటుంది. ఉండకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు లోకంలో ఉండరు.
లోకంలో ఉన్న దురదృష్టవతులందరిలోనూ మరీ దురదృష్టవతిగా కనబడుతుంది నాకు ద్రౌపది.
ఎందరో మగవారికి ఎలాంటి అరమరికలూ లేకుండా శరీరాన్ని అప్పగించిన స్త్రీలున్నారు. ఒకరి తర్వాత ఒకరినిగా ఎందరో భర్తలను కట్టుకున్న స్త్రీలూ ఉన్నారు. కాని, ఒకేసారి ఐదుగురిని పెళ్ళాడిన స్త్రీ - జీవితాంతం ఆ ఐదుగురితోనూ కాపురం చేసిన స్త్రీ - ఎన్నడూ ఆ ఐదుగురి మధ్య దాంపత్య సంబంధమైన అనుమానం గానీ, అసూయ గానీ, అసంతృప్తి గానీ కలగనీయకుండా నిర్వహించుకువచ్చిన స్త్రీ చరిత్రలో మరెవరైనా ఉన్నారేమో వెదికి చూడండి.
వంతుల ప్రకారం ఐదుగురితో కాపురం చేయటం ఏ భార్యకూ సహజం కాదు. సహజం కాని ఈ బాధ్యత తెచ్చిపెట్టే మానసిక సమస్యలను వ్యాసుడు గుర్తించలేదు. కుంతి పట్టించుకోలేదు. ద్రుపదుడు ఊహించలేదు. పాండవులలో ఒక్కరూ అర్థం చేసుకున్న దాఖలా లేదు.
అర్జునుని కోసమే పుట్టిన తాను, అర్జునుని కోసం కలలు కనటం తప్ప మరేమీ తెలియని తాను, అర్జునుని రప్పించటం కోసమే ఏర్పాటైన స్వయంవరంలో గొప్ప తేజస్వి ఒకడు మత్స్యయంత్రాన్ని కొట్టి తనను గెలుచుకున్నవేళ...
పదహారేళ్ళ పెళ్ళికూతురుగా - ఆనందమో, నిరాశో, నమ్మకమో, దిగులో ఏదో తెలియని - ఏదీ నిలవని - అన్నీ కలిసిన ఓ విచిత్రమైన వివశతను అనుభవించింది ద్రౌపది. తీరా, తనను గెలుచుకున్నది అర్జునుడే అని తెలిసి, పాలకడలి లాంటి తన మనస్సు ఉప్పొంగిపోయేలోగా, అందులో అమృతంతో పాటు హాలాహలమూ సుడులుకట్టింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|