|
|
Articles: Short Stories | ఆన్ లైన్ పెళ్లి - Editor
| |
'మందుంటే ముందుంటాం, లేకుంటే స్టేటు గవర్నరిచ్చిన విందైనా జారుకుంటాం' అన్న తరహాలో ఉండే మా మిత్రబృందం ఒకరూ ఒకరూ వచ్చి హాలు పక్క మరో గదిలో చేరుకుంటూ అక్కడి డిమ్ లైట్లలో పలకరించుకుంటూ హుషారుగా ఉన్నారు. మాలిని గొప్పదనం అదే. అలాంటి పార్టీలకు అన్ని హంగులతో కూడిన గది ఆవిడ ఏర్పాటే. హాలుకి కుడివైపున విశాలమైన మరో గదిలో పిల్లలు చేరారు. అక్కడ రకరకాల గేమ్స్, పెద్ద పెద్ద బొమ్మలు, సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. తలుపులు దగ్గరకు వేసేస్తే శబ్దం పైకి వినిపించని ఏర్పాటుంది. మధ్య విశాలమైన హాలులో మేం చతికిలబడ్డాం. ఎంతదూరాన ఉన్నా మాలిని మాటలు, నవ్వు తెలిసిపోతాయి. మధ్యమధ్య హాలులోకి వచ్చి స్వాగతం పలుకుతూ రెండుమూడు మాటలు చెబుతూ వెళ్ళిపోతోంది. మాలిని తెలుగు మాట్లాడడం చాలా తక్కువే.
ఆమె హుందాతనం, నవ్వు, మాటకారితనం, దర్పం ప్రదర్శించే కట్టు, బొట్టు తీరు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకొంటాయి. కాకపోతే ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా అదే పనిగా తను, తన కుటుంబం గురించే చెప్పుకునే గొప్పలు చాలామంది భరించలేరు. అవసరానికి ఆదుకునే మంచి గుణం కూడా ఉండడంతో ఆ లోపం కూడా అంతగా ఆమెకు అడ్డుకాలేదు. కూతుర్లు సంతానవంతులౌతూంటే వియ్యాల వారి కంటే ముందు అమెరికాలో వుండేది ఆమె. విమాన ప్రయాణం చేస్తే ఎయిర్ హోస్టస్ లు, ఫ్లైటు బర్సరులు అందరూ స్నేహితులయిపోతారు. ఫైలట్ కేబిన్ లోకి రానివ్వక గాని... లేకపోతే వాళ్లతో కూడా స్నేహం చేసేసేది. ఆవిడ అమెరికా గురించి మనకు చెబుతూంటే అమెరికా ప్రెసిడెంటు ప్రెస్ సెక్రటరీకయినా అన్ని విషయాలు తెలియవేమోననిపిస్తుంది.
ముకుందం మందు పార్టీలో చిక్కుకుపోయాడు. మరి ఆ రోజుకి నాకు కన్పించకపోయినా ఆశ్చర్యం లేదు. మా ఇద్దరి మధ్యా అలాంటి అవగాహన ఎప్పటినుంచో ఉంది. మేం కూర్చున్న చోట మాటిమాటికీ వస్తన్న రకరకాల స్నేక్స్, కూల్ డ్రింక్స్ తో మేం కూడా సరదాగానే ఉన్నాం. క్రమక్రమంగా ఇక్కడ కూడా హడావుడి పెరిగింది. అన్నిచోట్ల అమెరికా వాతావరణం. అక్కడున్న వాళ్ల పిల్లలు, వాళ్ల తెలివితేటలు, సంపాదనలు, ఇండియాకి వాళ్ల వల్ల జరుగుతున్న మేలు, మేధావులకు మనదేశం చూపుతున్న మొండి చెయ్యి... ఎంచేతో నేనుగాని, జానకిగానీ మా చిన్నబ్బాయి అమెరికాలో ఉన్న విషయం, మేం రెండు సార్లు అమెరికా వెళ్లిరావడం, అవసరాన్ని మించి ప్రస్తావిచడానికి పెద్దగా ఇష్టపడం. మా ఉత్కంఠ అంతా బుజ్జి ఎక్కడున్నాడు? వాడి పెళ్లి ఎలా జరుగబోతుందనే విషయంపైనే.
ఇంతలో మాలిని వచ్చి 'యువర్ ఎటెన్షన్ ప్లీజ్' అనగానే హాలంతా నిశ్శబ్దమయింది. 'మా ఒక్కగానొక్క అబ్బాయి బుజ్జి గురించి మీ కందరికీ తెలుసు. కొందరు వాడిని చిన్నప్పుడు చూసి ఉంటారు కూడా. మరికొద్ది సేపట్లో వాడి వివాహం జరుగబోతోంది... ఇక్కడ కాదు... స్టేట్స్ లో మా కాబోయే కోడలు పేరు బిందు. గుజరాతీ అమ్మాయి. కంప్యూటర్ ప్రొఫెషనల్, గ్రీన్ కార్డ్ హోల్డర్. ఎబౌఆల్ షి ఈజ్ ఆల్ రెడీ ఎర్నింగ్ సిక్ట్సీ కే' అంటూ మళ్లీ తెలుగు తర్జుమా చేసింది. 'అంటే ఆ అమ్మాయి ఇప్పుడే సంవత్సరానికి అరవైవేల డాలర్లు, అంటే నెలకు అయిదువేల డాలర్లు సంపాదిస్తోంది తెలుసా!' అక్కడితో ఆగలేదు. 'వాళ్ల కుటుంబం అంతా ఏనాడో అమెరికాలో సెటిలయింది. బిందూ ఈజ్ వెరీ క్యూట్, చామింగ్ అండ్ స్మార్ట్ గాల్... చాలా అందమైన, చలాకీ అయిన పిల్ల. మావాడు ఏది ఎంచుకున్నా తిరుగుండదు తెలుసా. వాడి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు.'
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|