|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
నూరు వరహాల చెట్టు పువ్వులొక పక్క, ఎర్రగన్నేరు పువ్వులొక పక్క రాలివున్నాయి. సీతాంక్షింతం పూలు, సిరిసింపూలు, చింతపూలు, మునగపూలు.. పూలే పూలు... మడకలు మడకలు.. మట్టిమీద పిచ్చి సొగసులు. మునగ కాడల వేళ్ళతో మన్నులోనున్న మమకారాలను చూపుతున్నాయి కొమ్మలు. ఈత పళ్ళ గెలలు - గుంటల్ని (పిల్లల్ని) ఎత్తెత్తుకు గెంతిస్తున్నాయి. చింత బొట్టలు ఒలిచి... చీకి... చొంగలు గారుస్తున్నారు పిల్లాపాపలు. రాచఉసిరి కొమ్మపైన కూకొని రామచిలుకలు తమ ఎర్రని వంపుతిరిగిన ముక్కులతో వెక్కిరించి నోరూరిస్తున్నాయి అందరికీ. నక్కి నక్కి పళ్ళ చెట్లెక్కుతున్నారు చిన్నిగాళ్ళు. నిప్పెట్టి కాల్చిన తేగలను ఒలిచి... వూదివూది నములుతున్నారు నానిగాళ్ళు.
డొంకల్లో దాగివున్న ఆగాకరకాయల్ని ఏరుతున్నారు ఆడగుంటలు - కాకరకాయ చదును వీళ్ళు... దుంప పసుపు కొమ్ముల్లాగున్నారు. రచ్చబండ దగ్గర పంచాంగం వింటున్నారు కొందరు.
కావుళ్ళు దించి... మురీలో, చెక్కిలాలో... పేలాలో, బెల్లం వుండలో... అని అరుస్తున్నారు తిరుగుళ్ల చిల్లర వ్యాపారులు.
రైతు : ఓరోరే పెద్దోడా - రారోరే దగ్గిరికి
యేలైపోతన్నాది - ఏరు సిద్ధం చెయ్యాల
ఈ యేడైనా నువ్వు - యవసాయం చెయ్యిరా
తంపర పొలమమ్మి నిన్ను - ఇంటరు చదివించినాను
సూరేమండ్లం పొలం అమ్మి నిన్ను - ఎమ్ సీయే చేయించినాను
అంజిలి కడియాలమ్మి తల్లి - 'ఒరాకల్' చదివించినాది
పిసరాపిప్పి(బంగారం) అమ్మీసి - సీ.ప్లస్సు చదివించినాది
గంజితాగినాం మేం - 'జావా' చదివించినాం నిన్ను
సాఫ్టువీరుడవయ్యీ - సంపాదిస్తనన్నావు
'సత్యం' కంప్యూటర్ల జేరి - సంపినావు గదరయ్యా
ఇంటికి పారొచ్చినావు - ఎలగ బతుకుతావురయ్య
రార్రార... ఓరోరే - సంకనాకి పోనావు
ఏరుబుయ్యడం నేర్చుకోర - బువ్వ దొరుకుతాది నీకు
(పాలేరు ఏరుబూతుకు కావలసిన సరంజామా తెచ్చి వుంచినాడు. రైతు - పెద్ద కొడుక్కి ఏరు సిద్ధంచెయ్యడం నేర్పుతున్నాడు)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|