|
|
Articles: Short Stories | సామాన్యుడి కోరిక - Site Administrator
| |
'ఓటరు మహాశయులకు నమస్కారం' అన్నట్టుగా రెండు చేతులూ పైకెత్తి భగవంతుడి విగ్రహం ముందుకు చాపుతూ నమస్కారం పెట్టింది. 'అయ్యోరూ.. నేను అసెంబ్లీకి మా ఆయన మీదే నిలబడుతున్నాను. తప్పులేదు సామీ! రోజూ తప్పతాగి ఇంటికొచ్చి నన్ను తన్నడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. నా ఒళ్ళు హూనం చేసేస్తున్నాడు సామీ. ఆణ్ణి ఎలా దారికి తేవాలో తెల్వక ఇలా చెయ్యాల్సొచ్చింది. ప్రజల కోసం ప్రభుత్వపోళ్ళు ఇచ్చిన సొమ్ముతో ఇలా సోకులు చేస్తున్నాడు. చేతిలో పైసలు లేకపోతే నన్నా ఇంట్లో ఓ మూల పడుంటాడేమోనన్న ఆశ. చూడండి సామీ... సంసారమే సరిగ్గా నడపలేనిది మీసేవలేం జేస్తద'ని పెచారం చేస్తున్నాడంట. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడిద్దని... నా సంసారం గుట్టు నేనే రట్టు చేసుకోవలసొస్తంది.
సామీ... నీకు తెల్వదా? ఆయనగారి సంపాదనంతా... అదే సామీ పెజల నోట్లో మన్ను, మశానం గొట్టి దోసుకున్న సొమ్ములు... ఆయన్నీ ఆ మెరకీధి మహాలచ్చిమికే పట్టుకెళ్లి ఇస్తున్నాడు. ఇంక నేను సంసారం ఎట్టాసెయ్యాలంట సెప్పు సామీ! అందుకే నాలాంటి ఆడకూతుళ్లు ఎవ్వళ్ళకీ వెరకీధి మాలచ్చిమీల బెడద లేకుండా సెయ్యాలని ఈ ఎలచ్చన్లలో నిలబడుతున్నాను. నా కష్టం నీతో సెప్పుకున్నాను మరి... ఎన్నికల్లో నెగ్గించి అసెంబ్లీకి పంపమని కోరుకుంటున్నాను. అన్నట్టు సామీ... ఎమ్మెల్లేనేనయితే నా మొగుడు అధికారం సెలాయిద్దామనుకుంటాడేమో... అలాసేస్తన్నారంటగదా సాలామంది! పెళ్ళాం ముఖ్యమంత్రి అయితే మొగుడు ఎనకాతలనుండి సెక్రం తిప్పేవాడంట కదా సామీ... అట్టాంటి పనులు సెయ్యకుండా మా ఆయన్ని నువ్వే ఓ కంట కనిపెట్టాల మరి. వెళ్ళొస్తా సామీ...' అంటూ ఆవిడ గారు ఇలా బయటకొచ్చిందో లేదో ఆవిడ భర్తగారు అలా వచ్చారు దైవ దర్శనం కోసం.
ఎదురొచ్చిన భార్యామణివంక కొరకొరా చూశాడు. మూతి ముఫ్ఫై మూడు వంకర్లు తిప్పుతూ ముందుకెళ్ళిపోయింది ఆవిడగారు. మరి ఆ భర్తగారి విన్నపాలేమిటో ఆలకిద్దాం రండి మరి.
'అయ్యా దేవుడుగారూ... నమస్కారాలండీ... అసలీ పెపంచకంలో ఆడోళ్ళకి భర్తలంటే గవురం లేకుండా పోతందండీ! అందుక్కారణం మా రాజకీయపోళ్ళేలెండి.. మా ఆడపడుచులూ... మా ఆడపడుచులూ అంటూ ముఖ్యమంత్రి నెత్తినెక్కించుకొని మగోల్లందర్నీ సులకన చేసిపడేశారు కదా సామీ! బాంక్ లోన్లు ఆడాళ్ళకేనంట. గాసుపొయ్యిలు ఆల్ల పేర్నేనంట. రేషన్ కార్డులు ఆల్ల పేర్నేనంట. ఇంక అన్నీ ఆల్లకే యిచ్చేత్తే మగోల్లం ఏటైపోతాం సామీ. అందుకే ప్రతిపచ్చం పార్టీ అభ్యర్థిగా పోటీ సేద్దాం అని నేనూ సూస్తే ఆ పెబుత్వపోళ్ళు మాయావిణ్ణి రెచ్చగొట్టి... నా మీదకే ఉసిగొల్పి ఆల్లపార్టీ టిక్కెట్టు ఇచ్చేసారు.
ఇక సూసుకోండి సామీ... మా ఆవిడ ఒకటే రెచ్చిబోతోంది. నేను ఒట్టి తాగుపోతునంట, తిరుగుబోతునంట. అంచేత నాకు ఓటు ఎయ్యకూడదంట. నీతో అబద్ధమెందుకు గానీ... సామీ ఏదో నలుగురు పెద్దోళ్ళతోనూ తిరుగుతుంటానా గవుర్నం కోసం కాస్త చుక్కేసుకొనే మాట నిజమే. అప్పుడప్పుడూ హుషారు కోసం ఆ మెరికీధికెళ్లిన మాట నిజమే. అంత మాత్రాన నేను తాగుబోతునయిపోతానా... తిరుగు బోతునయిపోతానా? పంచాయితీ పెసిడెంటుగా ఎనకేసిన సొమ్ముల్ని ఆ మెరకీధి మాలచ్చికి పెట్టేస్తాన్నానంటది. నాల్గురూపాయలట్టా గిరాటెట్టకపోతే పాపం అది మాత్రం ఎట్టా బతుకుద్ది సామీ. సాటి ఆడదై వుండి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్టాసామీ? సామీ... సివరగా నేను కోరుకొనేదేంటంటే మాయావిణ్ణి ఓడిచ్చి.... నన్ను గెలిపించి ఆ యధికార పార్టీ ఓళ్ళ కల్లు తెరిపంచమని ఏడుకుంటున్నాను. నమస్కారం సామీ. వత్తాను మరి... పెచారం కోసం బోల్డు ఊర్లు తిరగాలి' అంటూ గుడి బయటకు వచ్చాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|