|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
(ఛాయారాజ్)
మట్టి గట్టెక్కి, ఆ యెదర దిబ్బ మీదున్నతుమ్మచెట్ల మధ్యలోంచి తారురోడ్డంట పోతున్న ప్రతిబండినీ చూడ్డమే... నవమి. ఆదివారం. మందారం పువ్వంటి సాయంత్రంలోంచి కేసరిదండంలా సాచివున్న గోర్జంట ఎడ్లబండి మువ్వల ఘల్లుఘల్లు శబ్దాల వల్ల గుండెలు తాపిపడ్డాయి. దసరా వస్తోంది. దేవి వస్తోంది. ఇంటి ముందు బండి ఆగింది. దేవి భూమి దిగింది. వేలెడంత ఉందిగాని దాని కళ్ళు లోకమంత విస్తరించి ఉన్నాయి. పరుగెత్తి పరుగెత్తి వచ్చి చేతులు చుట్టూ తిప్పి, మోకాళ్ళకు చుట్టుకుంది. ఆ చిన్ని భూమి నన్ను పైకెత్తి గ్రహాంతర వాసంలోకి తీసుకుపోతుందా! అనిపించింది. నా చాతీలోని గుండెను కాజేసింది.
విశ్వమంత తబ్బిబ్బు! మూడడుగుల పొడవున్న మూడేళ్ళ పిల్ల దేవి, తలను కుడి వైపు వంపు తిప్పి, నా తలలోని కళ్ళలోనికి చూస్తోంది. నా రసాత్మ! అది తప్పక నా కవిత! చిన్ని భూగోళం పిల్ల. దాని నాలుకకూ గొంతుకూ సంబంధంలేనట్టు మూగగా నిశ్శబ్దంగా నవ్వుతోంది. రెండు చిన్న ఉపగ్రహాల్లో ఉన్న దేవి బుగ్గల్ని రెండు చేతులతోనూ తడిమాను... గిల్లలేదు, గిచ్చలేదు. గిచ్చితే భూమిలోంచి నీరు చిమ్ముతుంది, పెట్రోలు వస్తుంది. దీపాలు పుడతాయి... ప్రియ! ప్రియమైన ప్రేమ అది. ఆ వెలుగులు భరించడాన్కి నా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి.
దేవి దిగింతర్వాత సైన్యమంతా దిగింది. సరంజామా దిగింది వాకిలిలో. చింతచెట్టు కింది కెళ్ళి - బొట్టలు తీసి చీకింది. ఈత చెట్టు కిందికెళ్ళి - పళ్ళు ఏరి తిన్నది దేవి. అల్లంత దూరాన ఉన్న పుట్టను చూసింది. ఈ పక్కనున్న ముళ్ళడొంకల్లో నించి పిలుస్తోన్న చిమ్మెటలను పలుకరించింది. పాడ్యమి నుండి పంచమి వరకు తొమ్మిదడుగులు లెక్కించి ఇంటి ముందుకు నడిచి దిబుకు దిబుకున గెంతింది. దాని అమ్మ - మరో పెద్ద గ్రహంలాగొచ్చి 'అయ్యా... ఈ గుంటది వింతైనది. గౌను తొడుక్కోమంటే, కోక చుట్టమంటది. గడ్డం గిల్లి ముద్దుపెడితే, నాలుక చాపి నా నుదుటిని నాకుతుంది. నా బుగ్గలు గిల్లి అది నవ్వుతుందయ్యా... దీన్ని అమ్మకిచ్చేస్తాను. దీని వంటికి నువ్వుల నూనెరాసి, నలుగు పట్టించి, కుంకుడు కాయల పులుసుతో తల రుద్ది, కాపడం పెట్టిస్తే గాని దాని తిక్క కుదరదు' అంది. నన్ను చూసి ముసిముసిగా నవ్వుతుంది. తెలుగుభాషలోని తొలి వాక్యమెలాగుంటుందంటే... అచ్చం ఇలాగే... దేవిలాగే ఉంటుందనుకుంటాను.
ఎడ్ల మువ్వల చప్పుడులోంచి దసరా ముచ్చట్లు ఆరంభమయ్యాయి. పలుకరింతలు పూర్తయి ఇంట్లో దూరుతున్నారు ఒక్కొక్కరూ... అన్నీ కలిసాయి 'మాలోకాలు'!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|