|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
లస్మవ్వకు మెడలు, నడుం గుంజుతంది... మునుపటి వయసు గాదు... మునుపటి పెయ్యి కాదు... పెనిమిటి ఇరువై మూడేండ్ల కింద చచ్చిపోయినప్పట్నుంచి గిదే కష్టం...
లస్మవ్వ గుండె బాధగా మూలిగింది...
కొందరు మొగోల్లు లూనాలకు పాలక్యాన్ లేసుకుని ఆరన్ కొట్టుకుంట పోతుండ్రు... కొందరు పొల్లగాండ్లు సైకిండ్లకు పాలసీసాలు కట్టుకుని తొక్కుకుంట ఉరుకుతుండ్రు...
ఒకప్పుడు వాల్లతోని సమానంగ నడిసేది... నడిసి నడిసి బొక్కలరిగినయ్... మోసి మోసి మాడు పల్చవడ్డది...
తన పెండ్లిల్ల సైకిల్ గడియారం పెట్టాలె... ఆవుల్యాగెను కొట్టాలె అనడిగిండు పెనిమిటి. ఆవుల్యాగను కొట్టుడు అంటే కాదుగని... బర్రెనిచ్చిండ్రు పుట్టింటోల్లు. అప్పట్నుంచి ఎన్ని ఈతలు పెట్టింది... అన్ని పెయ్యదూడలె... తల్లి నొట్లెకెల్లి ఊసిపడ్డట్టే ఉండేటియి.... ఇప్పుడు పాలిచ్చే బర్రెను సూత్తె పెండ్లిల్ల కొట్టిన బర్రెనే యాదికత్తది....
లస్మవ్వా... పొద్దెక్కిందేమే... మన్కుల్నే పోదువ్ గద... ఎనుక నుంచి ఎగవోసుకుంట నడుత్తుంది కోటవ్వ...
బర్రె తన్నింది బిడ్డా... ఒక్క పూటనే ఇచ్చింది అన్నది లస్మవ్వ.
ముసల్తనానికి నెరివడుకుంట ఏం గోసనే... రంగరంగనుకుంట ఇంట్ల పండక... కోడలు బీడీలు చెయ్యవట్టె... కొడుకు దేశమంతుడేనాయె, ఎవ్ సం చెయ్యవట్టే... వాడుకాలు బందువెట్టరాదు... అన్నది కోటవ్వ.
'నోటికాడ బుక్క సెడగొట్టుకుంటామె కోటవ్వ... నీకేమన్న వాడుకాలు పెరిగినయానె' అనడిగింది లస్మవ్వ.
వాడుకాలు ఏడ దొరుకుతున్నయే... పాలు తీసుకునేటోల్లు ఇంకోల్లకు చెప్పరాయె. అండ్లనే నీల్లు కలిపి ఆల్లకు మనకు పోత్తరని అనుమానపడ్తరు. ఇంగ హోటల్లోల్లకు పోత్తె పైసలు సరింగ ఇయ్యరాయె. నెలకు నాలుగైదు రోజులు పాలు పగిలినయే కోటవ్వా... గిరాకి పాడైందంటరు అన్నది కోటవ్వ.
'గా ఎంకటపతి వోటల్ల కూడా మూడు లీటర్ల పాలు పోత్తున్నవట గదనే... పాలు సరిపోతన్నయా' అంది లస్మవ్వ.
'ఏడ సరిపోతన్నయే... ఆనికి పైసలియ్య దైర్నం రాదు... మర్నాగి మొకపోడు. పౌడర్ కలిపి పోత్తన్న' అన్నది కోటవ్వ నవ్వుకుంట.
'నా పుటాన పుటుకుల పౌడర్ కలుపలే బిడ్డా... పాపం తల్గదానె...' అన్నది లస్మవ్వ.
'కాలమే పాపపు కాలమాయె... ఇంక తల్గుడేంది... ఆడంత నియ్యతోడని పట్టు పాలు పోత్తమా' అంది లస్మవ్వను దాటేసుకుంట...
ఉన్క మీది రోకలి లెక్కనే చిటపట నడిచిపోయింది.
'నేను వాడుకాలు బందువెట్టాల్నట...దీని ఆశె పాడుగాను...' మనసుల తిట్టుకుంది లస్మవ్వ.
పక్కన తాడిచెట్ల ఎనుక స్మశానంల ఎవల్దో కాడు ఇంకా కాలుతనే ఉంది. నిప్కల్ల నుంచి పొగ లేత్తంది.
కాడుని సూడంగనే లస్మవ్వ గుండె ఇచ్చుకపోయినట్లయింది. లస్మవ్వ పెనిమిటిని గిదే స్మశానంల కాలవెట్టిండ్రు... రోజు రాంగపోంగ అక్కడికి రాంగనె నడుక తగ్గుతది... తెల్వకుంటనే అటు దిక్కు సూత్తది... కండ్లల్ల నీల్లు తిరుగుతయ్.
ఇరువై మూడేండ్లయినా కండ్లల్ల తడి ఆర్తలేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|