|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
పొద్దుగూకంగ వూర్లెకు రెండు లారీలచ్చినయ్...
బర్రెకు గడ్డి కోసుకుని నెత్తిమీద మోపేసుకొని వస్తున్న లస్మవ్వ కిష్టరెడ్డి ఇంటికాడ మంది బాగా కన్పడితే ఆగింది.
లారీల్లల్లకెయ్యి... పది బర్లు హుందాగా దిగినయ్... నల్లగ... నూనె పూసినట్టు నిగనిగ మెర్తన్నయ్. అందరు విచిత్రంగా సూత్తండ్రు... ఆ బర్లను చూసి లస్మవ్వ బీరిపోయింది.
'కిష్టరెడ్డి పటేలు పంజాబు నించి కొనుక్కచ్చిండ్రు... ముర్రాజాతి బర్రెలు... ఒక్కొక్క బర్రె ముప్పయ్ ఆరు వేలు... బర్లు తొమ్మిదే... ఇంకోటి దున్నపోతు' అన్నడు ఒకాయినె.
'ఎనుకట ఇంగ్లీసోల్లు ఎర్రతోలుతోని గిట్లనే దిగిండ్రు...' అన్నడొక ముసలాయినె.
'నీగ్గానుక సమరయోధుల పించినత్తందిరా తాతా... ఊకే ఇంగ్లీసోల్ల జోలి తీత్తవ్' కసురుకున్నడు ఓ యువకుడు.
పొట్టి తల... ఇంకా పొట్టి మెడ... ఎడల్పుగ వెన్ను... చిన్నగ వంక తిరిగిన కొమ్మలు... పొడుగు తోక... తెల్లటి కుచ్చు... పెద్ద పాలపొదుగు..
'బేంకు లోను తీస్కున్నవానె కిట్టన్నా... బాగానే పైసలై వుంటయ్' మొకమంత మార్చుకొని అడిగిండు రాజిరెడ్డి. కిష్టరెడ్డి పట్టిచ్చుకోలె.
'రోజుకు ఒక్కొక్క బర్రె ఇరువై లీటర్ల పాలిత్తయట... పిండెటోని జబ్బలుంటాయా?' అన్నడొకాయినె.
'మనుషులు పిండుతార్ర... పాలు పిండే మిషన్ దెచ్చిండు కిట్టన్న' అన్నడు తారీప్ చేసుకుంట ఇంకొకడు.
లస్మవ్వకు ఆచ్చర్యమనిపిచ్చింది.
'పాలు పిండే మిషినా... గదెట్లుంటది బిడ్డా...' పానం ఆపుకోక అడిగింది లస్మవ్వ. కిష్టరెడ్డి వట్టడబ్బాలకెల్లి... సైకిల్ పంపులు అతుక్కున్నట్టున్న ఓ మిషిన్ దీసిండు.
'ఇది పొదుగుకు పెడితే చాలు... పావుగంటల ఇరువై లీటర్ల పాలు పడుతయ్... దీన్ని మిల్కింగ్ మిషనంటరు' గర్వంగా చూపిచ్చిండు కిష్టరెడ్డి.
లస్మవ్వ పానం ఎల్లుకపోయింది.
'దుడ్డెబొక్కు మూతితోని పొదుగుని కుమ్మితె... తల్లి ప్రేమతోని పాలుకార్తది. పాలు గందుకే రుచుంటయ్... పొదుగు సండ్లను చేతితోనే తడుమంగనే... ప్రేమగ కండ్లు మూసుకుంటది బిడ్డా... మనిషికి పసురానికి నడుమ గీ మిషన్లేందిరా...' అన్నది.
'ఏం ముసల్దానా... నీకేం తెల్సే... ఇదంత మిషిన్ల కాలమేనాయె... తొమ్మిది బర్లంటే కనుస్కం రెండు వందల లీటర్ల పాలిత్తయ్... మల్ల గన్ని నీళ్ళు కలిపినా... నాలుగొందల లీటర్లయితయి. మస్కుల్నే జయితాలకు ఉరుకుతవ్ గదా... ఇగ మీ పాలెవడు కొంటడు. మన్నుబుక్కి మంచినీళ్లు తాగినట్టే ఫో...' నవ్వుకుంట అన్నడు సుతారి లింగన్న.
లస్మవ్వ గుండె జారిపోయింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|