|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మాత్రమే పరిమిత స్థాయిలో ఇలాంటి నంబర్ ప్రాజెక్టులు చేపట్టాయి. అమెరికా, బ్రిటన్ లు విస్తృత చర్చ అనంతరం బయోమెట్రిక్ ప్రాజెక్టుని ఆపి పెట్టాయి. ఆ దేశాల్లో ఈ ప్రాజెక్టు అమలులో ప్రైవసీ పెద్ద అభ్యంతరంగా మారింది. ఆస్ట్రేలియా కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. చైనా మాత్రం బయోమెట్రిక్ సమాచారం లేకుండా ఇలాంటి ప్రాజెక్టును చేపట్టింది. వియత్నాం లాంటి దేశాల్లో పౌరులకు ఇలాంటి నంబర్లను ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో కూడా ఐడింటిటీ నంబర్ల విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే అవి చిన్న దేశాలు.
భారతదేశంలో ఇప్పుడు అమలులో ఉన్న ఏ గుర్తింపుకార్డుకూ యుఐడి నంబర్ ప్రత్యామ్నాయం కాదు. పౌరసత్వం రుజువుగా కూడా ఇది కచ్చితంగా ఉపయోగపడదని అథారిటీ చైర్మన్ నందన్ నిలేకని స్పష్టంగా చెప్పారు. యుఐడి నంబర్ ప్రాజెక్టులో అసలు కార్డు అనేది ఉండదని కూడా నిలేకని వివరించారు. యుఐడిలో పౌరుడి పేరు, చిరునామా, వయసు, కుటుంబ వివరాలు వంటి మౌలిక సమాచారంతో పాటు బయోమెట్రిక్ వేలిముద్రలు డిజిటల్ గా నమోదై ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు. యూనిక్ ఐడింటిటీ నంబర్ లో 16 అంకెలు ఉంటాయి. దీన్ని గుర్తు పెట్టుకోవడం కష్టమే.
యుఐడి వల్ల సామాన్యులకు ఏం ఉపయోగం అని అనుకొంటే 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' (ఎన్ఆర్ఇజిఎస్), బిపిల్ వంటి రంగాలలో కొంత ఉపకరిస్తుంది. లబ్ధిదారులకు నేరుగా వేతనాలు చెల్లించేందుకు, డూప్లికేషన్ లేకుండా బయోమెట్రిక్ గుర్తింపు వీలు కల్పిస్తుంది. దళారులను దూరం చేయవచ్చు. దళారులను అరికట్టగా మిగిలే డబ్బులు, యుఐడి పథకం మొత్తం నిర్వహణకు సరిపోతాయని ప్రధాని స్వయంగా అన్నారు. ప్రధాని ఈ ప్రాజెక్టు విషయంలో పట్టుదలగా ఉండగా కొన్ని మంత్రిత్వ శాఖలు భిన్న రాగాలు ఆలపిస్తున్నాయి.
హోం, విదేశాంగ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి వంటి సంబంధిత మంత్రిత్వ శాఖలు ఈ పథకం ఆచరణ కష్టసాధ్యమని అంటున్నాయి. ప్రాజెక్టు రూపకల్పనలో ఉన్న లోపాలను, గతంలో ఇదే తరహా పథకాలలో చోటుచేసుకున్న వైఫల్యాలను ఆ శాఖల అధికారులు ప్రస్తావించారు. యుఐడి ప్రాజెక్టు పనులతో సంబంధం లేకుండా హోం శాఖ తీర, సరిహద్దు ప్రాంతంలో ఉన్న 13 రాష్ట్రాల్లో బహుళ ప్రయోజన జాతీయ గుర్తింపు కార్డులను ఇచ్చే పనిని చేపట్టింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|