|
|
Articles: TP Features | విద్యార్థుల విజయం - Site Administrator
| |
(దుర్గం రవీందర్)
ఎట్టకేలకు కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు సుముఖతం వ్యక్తం చేసింది. కేంద్ర హోంమంత్రి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆ పార్టీ ద్వారా నియమితులైన ముఖ్యమంత్రి రోశయ్యను ఆదేశించారు. ఈ నిర్ణయం తెలిశాకే కె.చంద్రశేఖర్ రావు తన 12 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. డిసెంబర్ 9న అర్ధరాత్రి ఈ వార్త విన్న తెలంగాణా పది జిల్లాలలోని 450 మండలాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో ఆనందం కనిపించింది. ప్రతి తెలంగాణావాదీ సంతోషించాడు.
విదేశస్తురాలు అయిన సోనియా దృఢసంకల్పం వల్లే ఈ నిర్ణయం సాధ్యమైంది. జనం కోరికను మన్నించడం ధర్మమని భావించి ఆమె తెలంగాణా ఏర్పాటుకు నిర్ణయించినట్లు ఐసిసి అనధికార వర్గాలు వెల్లడించాయి. ఇలా ఆమె తెలంగాణా వారి మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోయే నిర్ణయం చేశారు. ఇప్పుడిక రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, పార్లమెంట్ లో తీర్మానాన్ని బలపరిచి రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయడం లాంఛనంగా జరిగిపోతాయి. ఓ ఆరు నెలలు ఆటు ఇటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది.
ఈ విజయం విద్యార్థులది. మూలకారణం కేసీఆర్. అయినా సూత్రధారులు విద్యార్థులే. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని విద్యార్థులు, సామాన్య జనులు సాధించిన విజయం. ఇది దాదాపు ముప్ఫై మంది ఈ 12 రోజులలో మరణించారు. వారి మరణాల వెనుక అనేక విషాదాలు దాగి ఉన్నాయి. చనిపోయిన వారందరూ బిసి, ఎస్ సి, ఎస్ టి కులాలకు చెందినవారు. ఏ రాజకీయ పార్టీకీ చెందని సాధారణ జనం వారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష వాదుల వైఫల్యంలోంచి వాళ్ళ మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణా రాదేమో.. తమ బ్రతుకులు ఇంతేనేమో? అనే బెంగతో వారు చావును వరించారు.
ఒక్కో మృతుడి గతం, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, తాత ముత్తాల ఆస్తిపాస్తులు, అవి పరాధీనం అయిన తీరు గమనిస్తే ఆ మరణాలకు కారణాలు సులువుగా అర్థమవుతాయి. ఊర్లో ఇల్లు, శివార్లలో భూమి కోల్పోయారు. సంస్కృతి ఛిద్రమైంది. బ్రతకడానికి కనీస ఆశ కన్పించడం లేదు. 'ఆమ్దాని ఆఠనా, ఖర్చు బారానా' అనే రీతిలో ఎంత చేసినా తీరని అప్పులు, ముంబాయి, దుబాయి వలసలు, శృతి తప్పిన కుటుంబాలు, అమ్మాయిల అమ్మకాలు, ఆత్మహత్యలు వీటి నేపథ్యంలోంచి ఈ మరణాలు చూడాలి. దీన్ని అర్థం చేసుకున్నవారు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం నిర్ణయాన్ని సరైనది అని భావిస్తారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|