|
|
Articles: TP Features | జ్ఞాన ప్రసార మాధ్యమం తెలుగు - Site Administrator
| |
అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా తెలుగు భాష ద్వారా జ్ఞాన ప్రసారం ఎలా జరిగిందో అధ్యయనం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. తెలుగువారికున్నంత జానపద విజ్ఞానం చాలా కొద్ది భాషలకి మాత్రమే ఉంది. తెలుగులో ఉన్నన్ని వీరగాధలు, జానపద కథా కావ్యాలు, జానపద ఇతిహాసాలు, సామెతలు, గేయాలు చాలా కొద్ది భాషల్లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రసారమైన జ్ఞానాన్ని పరికించండి. తెలుగు వారి వృత్తుల్ని పరికించండి. వ్యవసాయం లాంటి వృత్తుల్లో తరతరాలుగా ఉపయోగిస్తున్న భాషని, పదాల వైవిద్యాన్ని, జ్ఞాన ప్రసార మార్గాలని పరిశీలించండి. జానపద కళలు, ఆటలు, పాటలు, ముగ్గులు, నమ్మకాలు, ఆచారాలు, పండుగలు మొదలైన వాటి ద్వారా తెలుగు భాష ఎలాంటి జ్ఞాన ప్రసారం చేసిందో ఆలోచించండి. ప్రజలు తమలో తాము మాట్లాడుకోవటానికి, వ్యాపారానికి, పనుల పురమాయింపునకు, ఆలోచనల వ్యక్తీకరణకు, అనుభవాల అభివ్యక్తికి భాషని ఎన్ని విధాలుగా ఉపయోగించాలో ఆలోచించండి. ఇలా చేసినప్పుడే తెలుగు భాష ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. తెలుగులో ఉన్నన్ని తిట్లు ఏ భాషలోనైనా ఉన్నాయా? రంగురంగుల చీరలకి, అంచులకి తెలుగువారికి పెట్టుకున్నన్ని పేర్లు ఎన్ని భాషల్లో ఉన్నాయి! తెలుగు వారికి లక్ష సామెతలున్నాయని చిలుకూరి నారాయణరావు ఒక్కరే సేకరించి నిరూపించారు. ప్రపంచంలో సామెతలనన్నింటినీ సేకరించి 'రేషియల్ ప్రోవెర్బ్స్' పేరుతో రిచర్డ్స్ ప్రచురించిన పుస్తకంలో పది వేల సామెతలు కూడా లేవు. ఇవన్నీ తెలుగు సామర్ధ్యాన్ని నిరూపించటం లేదూ?
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలుగు భాషకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వవలసిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం.
- తెలుగు భాషా సంస్కృతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
- తెలుగు భాషా మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగాలివ్వాలి.
- సంస్కృతం, ఫ్రెంచి, జర్మన్ లు చదవకుండా మాతృభాషనే ఉన్న విద్యలో చదవాలని కట్టడి చెయ్యాలి.
- తెలుగు భాషలో ఉపయోగంలో ఉన్న సమస్త పదజాలాన్నీ సేకరించి సమగ్ర నిఘంటువు నిర్మించాలి.
- తెలుగు జాతికి చెందిన ప్రతి ఒక్కరూ తెలుగువారమని చెప్పుకునే స్థితిని ప్రపంచమంతటా కల్పించాలి.
- ప్రపంచంలోని జ్ఞానమంతా తెలుగు వారికి, తెలుగువారి జ్ఞానమంతా ప్రపంచానికి తెలిసేలా చేయటానికి అనువాద అకాడమీని ఏర్పాటు చేయాలి.
- తెలుగును గూర్చి విస్తృత పరిశోధనలు జరపడానికి అవకాశాలు కల్పించాలి.
- పరిపాలనలో, విద్యలో అన్ని వ్యవహారాలలో తెలుగును ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి.
ఇవి మన కర్తవ్యాలలో కొన్ని మాత్రమే.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|