|
|
Articles: My Thoughts | వసంత పంచమి - Site Administrator
| |
వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని రుతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత రుతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత రుతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.
చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు.
వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావటంతో బాసర కిటకిటలాడుతోంది. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు ఏర్పాటుచేసి పెద్దవారికి నీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నదానం, వైద్య సౌకర్యం కల్పిస్తారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|