|
|
Articles: My Thoughts | వసంత పంచమి - Site Administrator
| |
(సురేష్ జి.)
వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయని హేమాద్రి తెలిపారు. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. 'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో ఉంది.
వసంత రుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.
సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్
జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|