ఉగస్య ఆది:ఉగాది: - 'ఉగ'అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. అంటే సృష్టి 'ఉగాది'. 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచునందని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.